ముసలితనానికి బ్రేకులు వేసే పిల్స్..!

ABN , First Publish Date - 2021-07-10T22:51:16+05:30 IST

ముసలితనం.. ఈ భూమిపై పుట్టిన దాదాపు అన్ని జంతువులనూ వెంటాడే శాపం. అప్సరసలైనా సరే ముసలితనంలో ముడుతలు పడిన చర్మంతో, నడవడానికి నానా అవస్థలూ పడుతుంటారు.

ముసలితనానికి బ్రేకులు వేసే పిల్స్..!

ఇంటర్నెట్ డెస్క్: ముసలితనం.. ఈ భూమిపై పుట్టిన దాదాపు అన్ని జంతువులనూ వెంటాడే శాపం. అప్సరసలైనా సరే ముసలితనంలో ముడుతలు పడిన చర్మంతో, నడవడానికి నానా అవస్థలూ పడుతుంటారు. యువరాజైన గౌతమ బుద్ధుడు సన్యాసిగా మారడానికి ఇది కూడా ఒక కారణం. మనిషికి ఆలోచన పుట్టినప్పటి నుంచి ఈ ముసలితనంపై ఎలా గెలవాలా? అనే ప్రశ్న అతని మనసును తొలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా దీనిపై తాము దాదాపు విజయం సాధించామంటూ అగ్రరాజ్యం అమెరికా చెప్తోంది. సైన్యం కోసం ఈ ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నామని వెల్లడించింది.


అమెరికా సైన్యానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ కమాండ్ (ఎస్‌వోసీవోఎమ్-సోకామ్) ఆధ్వర్యంలో ఈ పిల్స్ తయారవుతున్నాయట. అయితే ఈ పిల్స్.. ముసలితనంపై కాకుండా ముఖ్యంగా గాయాలను త్వరగా నయం చేయడంపై ఫోకస్ చేస్తాయి. మెట్రో ఇంటర్నేషనల్ బయోటెక్ అనే ప్రైవేటు ల్యాబొరేటరీ సహకారంతో తయారు చేస్తున్న ఈ పిల్స్.. ప్రీ-క్లినికల్ ట్రయల్స్, డోసింగ్ ప్రయోగాలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది నుంచి ఫాలో ఆన్ ప్రయోగాలు చేస్తామని సోకామ్ అధికార ప్రతినిధి టిమ్ హాకిన్స్ తెలిపారు.



అమెరికా సైనికుల సామర్థ్యాన్ని పెంచడం కోసం పెంటగాన్ చేస్తున్న ప్రయోగాల్లో ఈ పిల్స్ కూడా ఒక భాగమని తెలుస్తోంది. వయసు పెరిగేకొద్దీ సైనికుల ప్రదర్శనలో తగ్గుదల కనిపిస్తుందని, శరీరంలో నికోటినమైన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ +) పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించ వచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీని వల్ల గాయాలు చాలా వేగంగా నయమవుతాయని తెలుస్తోంది. జంతువులపై చేసిన ప్రయోగాల్లో ఎన్ఏడీ+ ఎంజైములో పెరుగుదల కనిపించిందని, మనుషుల్లో కూడా ఈ పిల్ ఇదే ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సైంటిస్టుల భావన. అలాగే ఈ ఔషధం గాయాలతోపాటు, న్యూరోడిజనరేషన్ (వయసు పెరగడంతో నాడీ వ్యవస్థ వేగం మందగించడం వంటి సమస్యలు)ను కూడా తగ్గిస్తుందట. ఈ పిల్స్‌ను మిలటరీకే పరిమితం చేయకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని టిమ్ హాకిన్స్ తెలిపారు.


ఈ ఔషధం మన శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలనే కొంత వేగవంతం చేస్తుందని, తద్వారా గాయాలను వేగంగా నయం చేస్తుందని టిమ్ చెప్పారు. అంతేకానీ సహజంగా లేని ఎటువంటి చర్యలూ ఈ పిల్ వల్ల ప్రేరేపితం కాబోవని స్పష్టంచేశారు. వీటి వాడకం వల్ల సైనికుల మానసిక, శారీరక ఆరోగ్యం చాలా మెరుగవుతుందని చెప్పిన ఆయన.. తద్వారా వాళ్లు తమకు ఇచ్చే మిషన్‌లను పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉంటారని చెప్పారు. తీవ్రమైన గాయాలు కూడా ఈ పిల్ తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతయాని, దీంతో సైనికులు వేగంగా మళ్లీ తమ విధుల్లో చేరవచ్చని వివరించారు. అలాగే వయసు పెరగడం వల్ల సైనికుల ప్రదర్శనలో వచ్చే మందకొడి తనాన్ని కూడా ఈ పిల్స్ తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రయోగాలు కొనసాగితే త్వరలోనే అసలు ముసలితనం అనేదే రాకుండా ఉండే ఔషధాలు కూడా వచ్చేస్తామని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-07-10T22:51:16+05:30 IST