Abn logo
Sep 23 2020 @ 02:00AM

రైతు వ్యతిరేక బిల్లులు అవి!

కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చేలా రూపకల్పన

ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు


డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు 22: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమైనవని, రైతులకు ఆశలు చూపి కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయాన్ని, ఆహార ధాన్యాలను దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు విమర్శించారు. సుందరయ్యభవన్‌లో జరిగిన రైతు సంఘాల ఉమ్మడి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు వి.రాజబాబు, వ్యవసాయ కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సతీష్‌ మాట్లాడారు.


రైతు పండించిన పంటకు కంపెనీలతో ఒప్పందాల ద్వారా రేటు వస్తుందని నమ్మబలుకుతున్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బిల్లు ఉన్నప్పటికీ వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు బిల్లుకు ఆమోదం తెలపడం రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు.


మార్కెట్‌ కమిటీలను రద్దు చేసి సేకరణ బాధ్యతలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర దాగి ఉందన్నారు. ఆహారధాన్యాలను పరిమితి లేకుండా సేకరించుకునే అవకాశం కల్పించడం వల్ల బ్లాక్‌ మార్కెట్‌ పెరిగి రైతులు, వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువ్ల ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించరాదని కోరుతూ ఈ నెల 25న నిరసనలు చేయాలని ఏఐకేఎంఎస్‌ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ నిరసనను విజయవంతం చేయాలని కోరారు.  

Advertisement
Advertisement
Advertisement