కొవిడ్‌ నియంత్రణపై ఏదీ సన్నద్ధత?

ABN , First Publish Date - 2021-04-20T07:38:43+05:30 IST

కొవిడ్‌ నియంత్రణపై జిల్లాలో అధికార యంత్రాంగం నుంచీ సన్నద్ధత కనిపించడం లేదు.

కొవిడ్‌ నియంత్రణపై ఏదీ సన్నద్ధత?

రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో పడకలపై అస్పష్టత

ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో చికిత్స అందేనా?

ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు, వైద్యంపై నియంత్రణేదీ?

అత్యవసర పరిస్థితుల్లో రోగి పిలిస్తే పలికేదెవరు?

ఎన్నికలు ముగిసినందున ఇకనైనా యంత్రాంగం దృష్టి పెట్టేనా?


తిరుపతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నియంత్రణపై జిల్లాలో అధికార యంత్రాంగం నుంచీ సన్నద్ధత కనిపించడం లేదు. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ప్రభుత్వం రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించిన స్విమ్స్‌, జిల్లా ఆస్పత్రులుగా ప్రకటించిన తిరుపతి రుయా, చిత్తూరు ప్రభుత్వాస్పత్రుల్లో పడకల సంఖ్య, అడ్మిషన్ల గురించి ప్రజలకు స్పష్టమైన సమాచారం లేదు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో వున్న ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు కనీస చికిత్సలైనా అందుతాయా అన్న ప్రశ్నకు సమాధానం అందే పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు, వైద్యం వంటి వాటిని నియంత్రించే వారూ కనిపించడం లేదు. వీటన్నింటికీ మించి కరోనా సోకిన బాధితుడికి అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు పిలిస్తే పలికేదెవరు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. రోజుకు సగటున ఐదారుగురు కొవిడ్‌ కారణంగా మృత్యువాతపడుతున్న తరుణంలో బాధితులకు అత్యవసర వైద్యం అందడం గగనంగా మారుతోంది. వీటిని దృష్టిలో వుంచుకుని అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాల్సి వుంది. ఇప్పటి వరకూ ఎన్నికల విధుల్లో బిజీగా వున్న యంత్రాంగం అవి ముగిసిపోయినందున పూర్తి దృష్టి కొవిడ్‌ నియంత్రణపై సారించాల్సి వుంది. జిల్లాలో గత నెల ఆరంభం నుంచీ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచీ ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలూ జారీ కాకపోవడంతో అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా తమకు తోచిన చర్యలేవో తీసుకుంటూ వస్తున్నారు. వాటిలో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం అనే అంశాలను ప్రజల్లో ప్రచారం చేయడం ఒకటైతే పోలీసులు, మున్సిపల్‌ అధికారులు మాస్కులు ధరించని వారికి స్వల్ప మొత్తాలు జరిమానా విధించడం మరోటి. ఈ ప్రచారాలూ, అవగాహనా కార్యక్రమాల సంగతి పక్కన పెడితే జిల్లా యంత్రాంగం నిర్దిష్టంగా నియంత్రణ చర్యలేవీ కఠినంగా అమలు చేయడం లేదు. మరోవైపు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోం. రోజుకు 5-10 చొప్పున నమోదవుతూ వచ్చిన పాజిటివ్‌ కేసులు కాస్తా ఇపుడు వెయ్యి దాటేస్తున్నాయి. అదే సమయంలో రోజువారీ సగటున ఐదారుగురు కొవిడ్‌ కారణంగా మరణిస్తుండడం జనంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ జన్యుమార్పులు సంతరించుకోవడం, ఎలాంటి లక్షణాలూ లేకుండానే ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనాల్సి వస్తుండడంతో జనం భీతిల్లుతున్నారు. దానికి తగ్గట్టు తిరుపతిలో స్విమ్స్‌, రుయా, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, మదనపల్లెలోని జిల్లా ప్రధాన  ఆస్పత్రుల్లోనూ కొవిడ్‌ రోగుల కోసం ఎన్ని పడకలు ఏర్పాటు చేశారు? వాటిలో ఐసీయూ పడకలు ఎన్ని? నాన్‌ ఐసీయూ పడకలు ఎన్ని? ఏయే ఆస్పత్రుల్లో ఎన్ని పడకలకు వెంటిలేటర్‌ సదుపాయం వుంది? మరెన్ని పడకలకు సాధారణ ఆక్సిజన్‌ సదుపాయం వుంది? జిల్లాలో ఏపీ వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కుప్పం, పలమనేరు, పుంగనూరు, వాల్మీకిపురం, తంబళ్ళపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, నగరి తదితర ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు ఏదైనా వైద్యం అందుతుందా?.... వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే వారు లేరు. అంతే కాకుండా టెస్టుల్లో పాజిటివ్‌ అని తేలితే బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే ఎవరికి ఫోన్‌ చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అన్న సమాచారమూ జనానికి అందడం లేదు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి అందుబాటులో వుండి మార్గదర్శనం చేసే సిబ్బంది కూడా ఎవరూ వుండడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ అన్నదే కనిపించడం లేదు. ఎన్ని పడకలు వున్నాయి? వాటిలో ఎన్ని ఖాళీ వున్నాయి? వైద్యానికి వేస్తున్న బిల్లులను పర్యవేక్షించేవారు, నియంత్రించే వారే లేకపోతున్నారు. ఇప్పటికే ఏ ప్రైవేటు ఆస్పత్రికి ఫోన్‌ చేసినా కొవిడ్‌ పడకలేవీ ఖాళీ లేవన్న సమాధానం వస్తోంది. ఈ అంశాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరముంది.గతేడాది కొవిడ్‌ సెంటర్లుగా విలువైన సేవలందించిన పద్మావతి, శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం సముదాయాల్లో ప్రస్తుతానికి పద్మావతీ నిలయం,విష్ణునివాసం మాత్రమే కొవిడ్‌ కేంద్రాలుగా మారాయి.మిగిలినవి కూడా అందుబాటులోకి వస్తే బాధితులకు ఊరటగా వుంటుంది. లేదంటే ఐసొలేషన్‌ పేరిట ఇళ్ళలో వుండడం వల్ల కుటుంబసభ్యులకూ వైరస్‌ సోకే ప్రమాదం తలెత్తుతోంది. వైరస్‌ సోకినప్పటికీ లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలతో వున్నవారు ఐసొలేషన్‌లో ఎలాంటి మందులు వాడాలన్నదానిపై కూడా జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సి వుంది. గత నెల నుంచీ నిన్నమొన్నటి వరకూ వరుసగా మున్సిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, తిరుపతి ఉప ఎన్నికలతో బిజీగా వుండిన జిల్లా యంత్రాంగం ఇపుడిపుడే కొవిడ్‌ నియంత్రణపై దృష్టి సారిస్తోంది. సోమవారం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు కాగా నోడల్‌ అధికారుల నియామకం వంటి చర్యలు తీసుకున్నారు. నియంత్రణ చర్యలను వేగవంతం చేయడంతో పాటు కరోనా సోకిన బాధితులకు తక్షణ సమాచారం, సాయం అందేలా చూడాల్సి వుంది.


తిరుపతిలో డేంజర్‌ బెల్స్‌


నగరంలో ఒకేరోజు 687 కరోనా కేసులు

రూరల్‌ మండలంలో మరో 109 కేసులు

జిల్లావ్యాప్తంగా 1182మందికి పాజిటివ్‌

వైరస్‌ బారిన పడి మరో నలుగురి మృతి


తిరుపతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):తిరుపతి నగరాన్ని కరోనా కమ్ముకుంటోంది.రోజూ వందలాది పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.ఆది, సోమవారాల నడుమ 24 గంటల్లో నగరంలో 687, తిరుపతి రూరల్‌ మండలంలో 109 కేసులు వెలుగు చూశాయి.ఒకేసారి కేసుల సంఖ్య భారీగా పెరగడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.మరోవైపు జిల్లావ్యాప్తంగా 1182 కేసులను సోమవారం గుర్తించారు. వైరస్‌ కారణంగా నలుగురు మరణించారు. గడచిన 24 గంటల్లో ఇక్కడ నమోదైన కేసులు రాష్ట్రంలోనే అత్యధికం కావడం గమనార్హం. అంతే కాకుండా రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో జిల్లాలో 8705 యాక్టివ్‌  పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది. తాజా కేసులతో జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 101436కు చేరుకోగా మరణాల సంఖ్య 922కు చేరుకుంది.తాజాగా గుర్తించిన కేసుల్లో తిరుపతి నగరంలో 687, తిరుపతి రూరల్‌ మండలంలో 109 నమోదయ్యాయి.శ్రీకాళహస్తిలో 37, కుప్పంలో 28, పుంగనూరులో 22, రేణిగుంటలో 18, చిత్తూరు, పాకాల మండలాల్లో 17 చొప్పున, చంద్రగిరిలో 16, గుడుపల్లెలో 15, పీలేరు, పూతలపట్టు మండలాల్లో 14 చొప్పున, మదనపల్లె, ఆర్సీపురం మండలాల్లో 12 చొప్పున, పలమనేరులో 11, తొట్టంబేడులో 10, పుత్తూరు, సదుం, సోమల మండలాల్లో 9 చొప్పున, కేవీబీపురం, వడమాలపేట మండలాల్లో 7 చొప్పున, పులిచెర్ల, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లో 6 చొప్పున, బైరెడ్డిపల్లె, కలికిరి, కేవీపల్లె, శాంతిపురం, వి.కోట మండలాల్లో 5 చొప్పున, కలకడ, పెనుమూరు, పిచ్చాటూరు, రామకుప్పం, రొంపిచెర్ల, వాల్మీకిపురం, ఎర్రావారిపాలెం మండలాల్లో 4 చొప్పున, గుర్రంకొండ, పెద్దపంజాణి, తవణంపల్లె, వెదురుకుప్పం, ఏర్పేడు మండలాల్లో 3 చొప్పున, జీడీనెల్లూరు, గంగవరం, గుడిపాల మండలాల్లో 2 వంతున, బీఎన్‌ కండ్రిగ, ఐరాల, కార్వేటినగరం, కురబలకోట, నాగలాపురం, నగరి, నారాయణవనం, నిండ్ర, పెద్దమండ్యం, తంబళ్ళపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


కొవిడ్‌ సెంటర్లలో 200 పడకల ఖాళీ 

తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సోమవారం రాత్రి 9  గంటలకు 200 పడకలు ఖాళీగా ఉన్నాయి.  పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 1000 పడకలుండగా 1200మంది బాధితులున్నారు. విష్ణు నివాసంలో 800పడకలుంటే 600 మంది బాధితులున్నారు. గతంలో ఉన్న ఆక్సిజన్‌ కేంద్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. సిబ్బంది కూడా కొరతగానే ఉన్నా ప్రారంభించిన రెండో రోజుకే 600 మంది కరోనా బాధితులు విష్ణు నివాసంలో అడ్మిట్‌ అయ్యారు.

Updated Date - 2021-04-20T07:38:43+05:30 IST