ఏపీత్రయంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-09-18T17:09:08+05:30 IST

ఏపీ త్రయంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని..

ఏపీత్రయంలో ఉద్రిక్తత

ఇంటి స్థలాలను చూసేందుకు బయల్దేరిన టీడీపీ నాయకులు

నిలువరించేందుకు మోహరించిన వైసీపీ నేతలు

టీడీపీ శ్రేణుల గృహ నిర్బంధం  


పెదపూడి(తూర్పు గోదావరి): ఏపీ త్రయంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ప్రజలు భయపడ్డారు. అచ్యుతాపురత్రయం గ్రామంలో బిక్కవోలు డ్రైన్‌కు ఆనుకుని వున్న భూములను ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు ఎంపిక చేసి సుమారు మూడు అడుగుల ఎత్తున మెరక చేశారు. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ భూమి నీట మునిగింది. అంతే కాకుండా ఈ స్థలాల్లో అడుగు భాగంలో గ్యాస్‌ పైపులైను, పై భాగంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఉన్నాయి. ఫిల్లింగ్‌ చేసిన భూమి నివాస గృహాలకు అనుకూలంగా ఉండదని ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.


ముంపు భూములను పరిశీలించడానికి గురువారం ఏపీత్రయం వస్తానని ప్రకటించారు. దీంతో ఉదయం మండల పరిధిలోని టీడీపీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయడమే కాకుండా పెదపూడి, ఏపీ త్రయం గ్రామాల్లో ప్రత్యేక పహారా కాసారు. దీనికి తోడు వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి పర్యటనను అడ్డుకోవడానికి భారీ సంఖ్యలో లబ్ధిదారులతో కలిసి ఏపీ త్రయం వంతెన వద్ద గుమిగూడారు. ముంపునకు గురైన భూమిని పరిశీలించడానికి వెళ్తామంటే అభ్యంతరం ఏమిటని గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు మార్ని రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు జుత్తుక కృష్ణ, కార్యదర్శి కొటికలపూడి సత్తిబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిర్రా వరప్రసాదరావు అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. పెదపూడిలో సొసైటీ మాజీ అధ్య క్షుడు పుట్టా గంగాధరచౌదరి నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు.


శాంతియుతంగా భూ పరిశీలనకు వెళ్తామంటే అధికార పార్టీ నాయకులు ఎందుకు ఉలికిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.భూ సేకరణలో భారీ కుంభకోణం జరిగిందా అన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు. సెక్షన్‌ 144 టీడీపీ నాయకులకే వర్తిస్తుందా, అధికార పార్టీ వారికి వర్తించదా అంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసినట్టు కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయలేదని చెప్పారు. కరకుదురు దత్తుడు, పుట్టా గంగా ధర చౌదరి, పెండెం అప్పన్న, సానా శ్రీను పాల్గొన్నారు. 


ఇళ్ల స్థలాల్లో అక్రమాలను బయటపెడతాం 

అనపర్తి: ప్రతి పేదవాడికీ నివాస స్థలం ఇస్తామంటూ ప్రభుత్వం భూఅక్రమాలకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో నివాసయోగ్యం కాని స్థలాలను అధిక ధరలకు కొనిపించి వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. అచ్యుతాపురత్రయంలో నిరసన తెలిపేందుకు కొద్దిమంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బయల్దేరిన రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులు తీరుకు నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల సేకరణలో ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు సుమారు 50 కోట్లు కైంకర్యం చేశారని, దీనిపై విచారణ  చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, పులగం అచ్చిరెడ్డి, తేనెల శ్రీనివాస్‌, చింతా సురేష్‌రెడ్డి, మామిడిశెట్టి శ్రీను, దోసారెడ్డి, వీర్రాఘవరెడ్డి, పెదపూడి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T17:09:08+05:30 IST