చేనేతల సంక్షేమం కోసం కృషి చేద్దాం

ABN , First Publish Date - 2021-05-18T06:28:06+05:30 IST

చేనేతల సంక్షేమం, ఆప్కో అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా కృషి చేద్దామని చేనేత, జౌళిశాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు సంబంధించి అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అన్నారు.

చేనేతల సంక్షేమం కోసం కృషి చేద్దాం
శశిభూషణ్‌ కుమార్‌ను అభినందిస్తున్న ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ 

మంగళగిరి, మే17: చేనేతల సంక్షేమం, ఆప్కో అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా కృషి చేద్దామని చేనేత, జౌళిశాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు సంబంధించి అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన శశిభూషణ్‌కుమార్‌ను ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు ఏపీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నేతన్నల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆప్కో ప్రస్తుత పరిస్థితిని చైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు వివరిస్తూ ఆప్కో ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. సంస్థను బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా తొలుత ప్రస్తుతం ఉన్న రూ.25 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పాత షోరూమ్‌లను ఆధునీకరించి, ప్రధాన నగరాలు, పట్టణాలలో కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. అలాగే మాక్‌ సొసైటీలను ప్రవేశపెడితే ప్రతి జిల్లాలో 1000-2000 మగ్గాలు ఏర్పాటు చేసుకోవచ్చని దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, వేలాదిమంది నేత కార్మికులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందన్నారు. 

మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ టర్నోవర్‌ బాగానే ఉన్నప్పటికీ ముడిసరుకు విషయంలో పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని, మనం కూడా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే ముడిసరుకును మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందని చిల్లపల్లి వివరించారు.

Updated Date - 2021-05-18T06:28:06+05:30 IST