చేసిన పాపం..

ABN , First Publish Date - 2022-02-28T08:42:21+05:30 IST

‘‘ఐరోపాలో నాగరకతే లేనికాలంలోనే.. వేల ఏళ్ల క్రితం కౌటిల్యుడు, చాణక్యుడు వంటివారి ద్వారా భారత్‌కు దౌత్యనీతిలో అద్భుతమైన సామర్థ్యం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ

చేసిన పాపం..

  • భారత అణుపరీక్షను వ్యతిరేకించిన ఉక్రెయిన్‌
  • ఇప్పుడు భారత్‌ సాయం కోసం విజ్ఞప్తి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ‘‘ఐరోపాలో నాగరకతే లేనికాలంలోనే.. వేల ఏళ్ల క్రితం కౌటిల్యుడు, చాణక్యుడు వంటివారి ద్వారా భారత్‌కు దౌత్యనీతిలో అద్భుతమైన సామర్థ్యం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా భారతదేశం చాలా ఏళ్లపాటు ప్రభావవంతమైన అంతర్జాతీయ శక్తిగా ఉంది. అలాంటి భారత్‌ సా యం కోసం మేమిప్పుడు అర్థిస్తున్నాం. ప్రపంచంలోని అత్యం త శక్తిమంతమైన నేతల్లో ఒకరైన మోదీజీకి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ప్రపంచ దేశాధినేతల్లో ఎంత మంది మాట పుతిన్‌ వింటారో నాకు తెలియదుగానీ.. మోదీతో ఉన్న అనుబంధంతో రష్యా అధ్యక్షుడు కనీసం ఆయన మాటలను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. భారత్‌ నుంచి మేం మరింత సానుకూల ధోరణిని ఆశిస్తున్నాం’’


..ఉక్రెయిన్‌పై రష్యా రణగర్జన చేసిన వేళ భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పోలిఖా చేసిన అభ్యర్థన ఇది. 


కానీ.. గతంలో ఆ దేశం మన అణు పరీక్షలను వ్యతిరేకించిన తీరు, కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యానికి అనుకూలంగా వేసిన ఓటు, భారత్‌ అభ్యంతరాలను తోసిరాజని మరీ పాకిస్థాన్‌కు యుద్ధట్యాంకులు అమ్మడం.. తదితర అంశాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. 1998లో వాజపేయి హయాంలో ‘ఆపరేషన్‌ శక్తి’ పేరిట భారత్‌ నిర్వహించిన అణుపరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించిన దేశాల్లో ఉక్రెయిన్‌ కూడా ఉంది. అంతేకాదు.. భారత్‌ తదుపరి అణుపరీక్షల ను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్‌పీటీ)పైన, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై సంతకం చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన 1172 తీర్మానాన్ని సమర్థించిన 25 దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. అణ్వాయుధాలను మోసుకెళ్లే బాలిస్టిక్‌ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాన్ని, అణ్వాయుధాల తయారీకి అవసరమైన పదార్థాల ఉత్పత్తిని కూడా భారత్‌ నిలిపివేయాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే.. 2017లో పాకిస్థాన్‌కు 330 టి80డి యుద్ధ ట్యాంకులను విక్రయించింది. 2019లో ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్‌ వ్యతిరేకించి పాక్‌ పక్షాన నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రష్యా, ఇండియా మధ్య స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని మనవైపు ఆశగా చూడడం విధి వైచిత్రి కాక మరేమిటి! 




ఉపసంహారం: ఉక్రెయిన్‌ పరిస్థితి చూస్తే పాపం అని జాలి కలుగుతుంది. కానీ.. ఇన్నాళ్లుగా ఆ దేశాన్ని ఎగదోసి, తీరా యుద్ధం ముంచుకొచ్చాక ‘మేం ఉక్రెయిన్‌ కోసం ప్రార్థి స్తాం’ అన్న అమెరికాకు, ‘ఉక్రెయిన్‌కు కావాల్సిన హెల్మెట్లు, వైద్య సాయం అందిస్తాం తప్ప ఆయుధాలివ్వం’ అని తేల్చి చెప్పిన జర్మనీ, ‘అబ్బే మేం యుద్ధం చేయం.. కావాలంటే రష్యాపై ఆంక్షలు విధిస్తాం’ అంటున్న ఇతర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు లేని జాలి ఉక్రెయిన్‌పై మనకు మాత్రం ఎందుకన్నది సగటు భారతీయుడి సందేహం!!

Updated Date - 2022-02-28T08:42:21+05:30 IST