అంగన్‌వాడీలకు బీమా వర్తింపజేయండి
ABN , First Publish Date - 2021-09-04T08:15:58+05:30 IST
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి రాష్ట్ర మంత్రి సత్యవతి వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వివిధ అంశాలపై వినతి పత్రాలను అందించారు. అంగన్‌వాడీల వేతనాలను గతంలో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరించేవని దానిని 25:75కు తగ్గించారని, పరిపాలనా వ్యయం మొత్తాన్ని ఆపేశారని వీటిని పునరుద్థరించాలని కోరారు. పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కొనసాగించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటించేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని సత్యవతి రాథోడ్ మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఉన్నారు.