Abn logo
Nov 25 2021 @ 02:50AM

సాగు చట్టాల రద్దుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

  • పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు
  • రద్దు ప్రక్రియను పూర్తి చేశాం: ఠాకూర్‌
  • మార్చి వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఫ్రీ 
  • నాలుగు నెలల్లో 53,344 కోట్ల ఖర్చు
  • కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు 
  • ఆరు డిమాండ్లు పరిష్కరిస్తే 
  • ఆందోళన విరమిస్తాం: టికాయత్‌


న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు చట్టాల రద్దుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది నుంచి రైతులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ఠ వేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ వెనక్కి తగ్గేదే లేదని గత శుక్రవారం ప్రధాని మోదీ కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కేంద్ర క్యాబినెట్‌ కూడా చట్టాల రద్దుకు ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేశామని, రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇదే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపారు. రైతుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన ‘ఎమ్మెస్పీకి చట్టబద్ధత’ కల్పిస్తారా? అన్న ప్రశ్నకు ఠాగూర్‌ సమాధానం ఇవ్వలేదు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దు బిల్లుతో పాటు మరో 25 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా ఉంది. 


మరో 4 నెలలు పీఎంజీకేఏవై

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో 4 నెలల పాటు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా (5కిలోలు) గోధుమలు, బియ్యా న్ని సరఫరా చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీని కోసం రూ.53,344 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.  


కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్‌ అప్రెంటీ్‌సషిప్‌ ట్రైనింగ్‌ స్కీం (నాట్స్‌)’ను రూ.3,054 కోట్లతో మరో ఐదేళ్లు కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సారి 4.5 రెట్లు ఎక్కువ నిధులు కేటాయించడం విశేషం.


వాతావరణ శాస్త్రానికి సంబంధించిన ‘ది అట్మాస్పియర్‌ అండ్‌ క్లైమేట్‌ రిసెర్చ్‌- మోడలింగ్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఎక్రాస్‌)’ పథకాన్ని మరో ఐదేళ్లు కొనసాగించేందుకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,135 కోట్లతో దీన్ని కొనసాగించనున్నారు.


కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్‌ హవేలీ, డామన్‌, డయ్యూలో విద్యుత్తు పంపిణీని ప్రైవేటీకరించేందుకు ‘స్పెషల్‌ పర్ప స్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)’ ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 


6 డిమాండ్లు పరిష్కరిస్తే ఆందోళన విరమణ: టికాయత్‌

కొత్త సాగు చట్టాల రద్దుకు కేం ద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడాన్ని ‘లాంఛన’ ప్రక్రియగా రైతు సంఘాలు అభివర్ణించాయి. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి చట్టబద్ధ త కల్పించడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వా న్ని కోరాయి. జనవరి 26లోపు కేం ద్రం తమ 6 డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరిస్తే ఆందోళన విరమిస్తామని టికాయత్‌ చెప్పారు.


క్రిప్టో కరెన్సీ కూడా ఒక ఆస్తి..!

కనిష్ఠ మొత్తంలో పెట్టుబడులకు కేంద్రం అనుమతి?

క్రిప్టో కరెన్సీని కూడా ఒక ఆస్తి (ఫైనాన్షియల్‌ అసెట్‌)గా పరిగణించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదిత బిల్లులో మార్పులు చేసే అవకాశం ఉంది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో క్రిప్టో బిల్లును ఆమోదిస్తారని వార్తలు వెలువడిన సంగ తి తెలిసిందే. అయితే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ఆలోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు క్రిప్టోలను నిషేధించడంతోపాటు కొన్ని మినహాయింపులతో క్రిప్టో కరె న్సీ వినియోగాన్ని అనుమతించనున్నట్టు కేంద్రం సూచనప్రాయంగా పేర్కొంది. కనిష్ఠ మొత్తంలో డిజిటల్‌ కరెన్సీ పెట్టుబడులను అనుమతించే అవకాశం ఉంది. ఈ మేరకు బిల్లులో నిబంధనలు పొందుపరచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో రుణాలు, ఇతర చట్టబద్ధ చెల్లింపులకు ఈ కరెన్సీని అనుతించకుండా బిల్లులో నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు బిల్లులో సవరణలు ఉండొచ్చని తెలిసింది. ఆ తర్వాత బిల్లు క్యాబినెట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింన సంగతి తెలిసిందే.