అనుమతి లేకుండా ఆక్వాసాగు

ABN , First Publish Date - 2021-04-18T05:41:09+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా చెన్నైలోని సెంట్రల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ) తో పాటు రాష్ట్రస్థాయిలో అఽథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే సాగుకు చర్యలు చేపట్టాలి. కానీ జిల్లాలో చాలాచోట్ల ఈ నిబంధన అమలుకావడం లేదు. ఆక్వాసాగు అనంతరం విడిచిపెట్టే వ్యర్థాల వల్ల వరిపంటపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనధికార సాగుపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అనుమతి లేకుండా ఆక్వాసాగు
డొంకూరులో రొయ్యల చెరువు

 నిబంధనలు బేఖాతర్‌

వరి పంటపై తీవ్ర ప్రభావం

 రొయ్యల వ్యర్థాలతో దుర్గంధం

 చోద్యం చూస్తున్న అధికారులు

ఇచ్ఛాపురం రూరల్‌

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా చెన్నైలోని సెంట్రల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ) తో పాటు రాష్ట్రస్థాయిలో అఽథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే సాగుకు చర్యలు చేపట్టాలి. కానీ జిల్లాలో చాలాచోట్ల ఈ నిబంధన అమలుకావడం లేదు. ఆక్వాసాగు అనంతరం విడిచిపెట్టే వ్యర్థాల వల్ల వరిపంటపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనధికార సాగుపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, శ్రీకాకుళం కోస్తా తీరప్రాంత మండలాల్లో సుమారు 958 హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వందలాది మంది రైతులు రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ఆక్వాసాగు చేస్తున్న రైతులు విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల  ప్రజలు వ్యాధుల భారినపడుతున్నారు. వరి తదితర పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.


విష వాయువుల విజృంభణ

ఆక్వాసాగు వల్ల విషవాయువులు విజృంభిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యాధులతో మంచం పడుతున్నారు. దీనికితోడు వరితో పాటు వాణిజ్యపంటల దిగుబడి తగ్గిపోతుండడంతో ఆందోళన వ్యక్తమవు తోంది. ఆక్వాసాగు చేస్తున్న పరిసర ప్రాంతాలు కాలుష్య మయవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషిత మవుతున్నాయన్న ఆందోళన నెలకొంది.


ఊపిరిపోసిన వెనామీ

దశాబ్దకాలం కిందట వెలుగు వెలిగిన ఆక్వారంగం ఇటీవల పూర్తిగా దెబ్బతింది. నష్టాల పుణ్యమాని ఆ రైతులు నీలి విప్లవానికి (ఆక్వా సాగు) స్వస్తి పలికి వరి సాగువైపు దృష్టి సారించారు. ఇటీవల వచ్చిన వెనామీ సాగుతో మళ్లీ రైతులు ఆక్వాసాగు వైపు దృష్టిని సారిస్తున్నారు. ఈనేపథ్యంలో బడా రైతులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఆక్వా రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రనే ఆరోపణలున్నాయి. 


ఇవీ సాగు నిబంధనలు

 రొయ్యలు చెరువులు సాగు చేసే రైతులు ముందుగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత తహసీల్దార్‌, మత్స్య, వ్యవసాయ, వాతావరణ శాఖ అధికారులు మొదట పరిశీలించి నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తారు. అనంతరం జిల్లా కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నివేదికను కలెక్టరు అనుమతి కోసం పంపిస్తుంది. కలెక్టర్‌ అనుమతి ఇచ్చిన తర్వాతే చెరువులను సాగు చేయడం ప్రారంభించాలి.

 జిల్లాలో వందలాది మంది రైతులు ఈ నిబంధనలను బేఖాతర్‌చేసి సాగు చేస్తున్నారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేయడం లేదు. రొయ్యల చెరువుల్లో భారీగా రసాయనాలు వినియోగిస్తుండడంతో తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


చిన్న రైతులపై తీవ్ర ప్రభావం

జిల్లాలో అధికశాతం మంది రైతులు నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులను ఏర్పాటుచేస్తున్నారు. రొయ్యలు చెరువులు నుంచి విడుదలచేస్తున్న మురుగుకాలువల్లోకి చేరుతుండడంతో వరిసాగుతోపాటు మత్స్య సంపద దెబ్బతింటోంది. దీంతో సన్న,చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న బడా ఆక్వారైతుల జోలికి అధికారులు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. చిన్న రైతుల చెరువులు సీజ్‌చేస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయానికి స్వస్తి చెప్పి పరిశ్రమల్లో కూలీలుగా మారిపోతున్నారు. దీనికితోడు కుళ్లిన రొయ్యల వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల్లో వేస్తుండడంతో దుర్గంధం వెలువడుతోందని పలువురు వాపోతున్నారు.


అనుమతి ఉండాల్సిందే

రొయ్యలు చెరువులు సాగుచేసే రైతులు నిబంధనలు  పాటించాలి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతే చెరువులు సాగుచేయాలి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రొయ్యలు చెరువులు సాగు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.

-పీవీ శ్రీనివాసరావు, జేడీ, మత్స్యశాఖ

Updated Date - 2021-04-18T05:41:09+05:30 IST