యథేచ్ఛగా అక్రమ దందా!

ABN , First Publish Date - 2022-02-06T05:45:09+05:30 IST

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో వ్యాపారుల అక్రమ దందా యథే చ్ఛగా సాగుతోంది. అన్ని రకాల వ్యాపారాలకు అధికారు లు ట్రేడ్‌ లైసెన్స్‌లను జారీ చేయాల్సి ఉంది.

యథేచ్ఛగా అక్రమ దందా!
ఆదిలాబాద్‌ పట్టణంలోని వ్యాపార సముదాయం



ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీలో అధికారుల నిర్లక్ష్యం
చిరు వ్యాపారులపైనే బల్దియా పెత్తనం
వైన్‌షాప్‌లు, సూపర్‌మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్ల యజమానుల ఇష్టారాజ్యం
ఏటా లక్షల రూపాయల ఆదాయానికి గండి
 ప్రత్యేకాధికారి పాలనలోనూ  కనిపించని మార్పు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో వ్యాపారుల అక్రమ దందా యథే చ్ఛగా సాగుతోంది. అన్ని రకాల వ్యాపారాలకు అధికారు లు ట్రేడ్‌ లైసెన్స్‌లను జారీ చేయాల్సి ఉంది. కానీ అధికారులు అవేమీ పట్టించుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి యేటా లక్షల రూపాయల ఆదాయం గండిపడుతోంది. ప్రధాన ఆదాయ మార్గమైన ట్రేడ్‌లైసెన్సుల జారీపై అధికారులు దృష్టి సారించక పోవడంతో అడిగే వారే కరువవుతున్నారు. గతేడాదిగా ట్రేడ్‌ లైసెన్సుల జారీని నిలిపి వేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ పరిధిలో 5వేల వరకు వివిధ వ్యాపార దుకాణాలు ఉండగా కేవలం 3802 ట్రేడ్‌ లైసెన్సులను మాత్రమే జారీ చేశారు. ఈ ఏడు 20లక్షల 25వేల డిమాండ్‌ ఉండగా ఇప్పటి వరకు 16లక్షల లైసెన్సు ఫీజును వసూలు చేశారు. పట్టణంలో వివిధ వ్యాపార దుకాణాలు ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రమే లైసెన్సులను జారీ చేసి మిగతా వాటిని వదిలేయడం విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని వ్యాపారాలు బల్దియా నేతల బంధువులవి కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. అసలు నిబంధనల ప్రకారం ట్రేడ్‌లైసెన్సు తీసుకున్న తర్వాతనే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇష్టారాజ్యంగా పట్టణంలో ఇల్లీగల్‌ వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతునే ఉన్నారు. స్థానిక సంస్థల పాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. అయిన పాలనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదంటున్నారు. గతంలో మాదిరిగానే మున్సిపల్‌ అధికారుల తీరు కనిపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
తప్పించుకుంటున్న బడా వ్యాపారులు..
ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లించకుండానే కొందరు భడా వ్యాపారులు తప్పించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా వైన్‌షాపులు, సూపర్‌మార్కెట్లు, పె ట్రోల్‌బంక్‌లు, ఫంక్షన్‌హాల్‌లు, పెద్ద పెద్ద మాల్స్‌ వ్యాపారస్థులు ఎలాంటి ట్రేడ్‌ లైసెన్సులను తీసుకున్నట్లు కనిపించడం లేదు. వ్యాపారం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా లైసెన్స్‌ తీసుకోకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారం ఏటా 10 శాతం విలువను పెంచుతు లైసెన్స్‌ ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుంది. వైన్స్‌షాపులకు రూ.10వేలు, పెట్రోల్‌బంక్‌, ఫంక్షన్‌హాల్‌కు రూ.15వేలు, సూపర్‌మార్కెట్‌ తదితర కార్పొరేట్‌ సంస్థల వ్యాపారాలకు రూ.20వేల వరకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుగా వసూలు చేయాల్సి ఉంటుంది. కొత్త మద్యం పాలసీలో టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసి మూడు నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరూ ఇప్పటి వరకు ట్రేడ్‌ లైసెన్సులు తీసుకున్న దాఖలాలు లేవు. నాలుగేళ్లుగా ప్రారంభించిన పలు సూపర్‌మార్కెట్‌లకు కూడా లైసెన్స్‌ తీసుకో కుండానే అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా తెలియనట్లుగానే వ్యవహరించడం తో వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పో తుందంటున్నారు. క్షేత్ర స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ట్రేడ్‌ లైసెన్సులను జారీ చేస్తే యేటా రూ.50లక్షల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం ట్రే డ్‌ లైసెన్సుల జారీని తేలికగానే తీసుకోవడంతో యేటా బ ల్దియాకు లక్షల రూపాయల ఆదాయం నష్టం వాటిల్లుతోంది.
నిబంధనలు గాలికి..
మున్సిపల్‌ పరిధిలో ఎలాంటి వ్యాపారం చేయాలన్న నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కిరాణా కొట్టు నుంచి సూపర్‌ మార్కెట్‌ వరకు ట్రేడ్‌లైసెన్స్‌ను తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగుతున్న అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడో రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై పెత్తనం చలాయించే బల్దియా అధికారులు భడావ్యాపారుల జోలికి వెళ్లడం లేదంటున్నారు. అలాగే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార దుకాణాల చుట్టుపక్కల వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పార్కింగ్‌, పొల్యూషన్‌, పారిశుధ్యం లాంటి వాటిని పరిశీలించిన అనంతరమే అధికారులు ట్రేడ్‌లైసెన్సును జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఇలాంటి నిబంధనలు, పర్యవేక్షణ చేయకుండానే లైసెన్సులను జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫుట్‌పాత్‌ వ్యాపారులపై వేల రూపాయల జరిమానాలు విధిస్తున్న అధికారులు పెద్ద పెద్దమాల్స్‌, కార్పొరేట్‌ బడా వ్యాపారుల పై కనీస స్థాయిలో చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థలను వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు స్థానిక అధికారులు బడా వ్యాపారులకు తలొగ్గి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం..
- నరేందర్‌ (మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఆదిలాబాద్‌)

మున్సిపల్‌ పరిధిలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరిపినా వ్యాపారస్థులు ట్రేడ్‌ లైసెన్సులను తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మార్చిలోగా వ్యాపారస్థులందరు ట్రేడ్‌ లైసెన్సును కలిగి ఉండాలి. అనుకున్న టార్గెట్‌ ప్రకారం లైసెన్సుల జారీపై దృష్టి సారిస్తున్నాం. నిబంధనల ప్రకారమే లైసెన్సులను జారీ చేస్తున్నాం. పట్టణంలోని మద్యం షాపు, ఫంక్షన్‌హాల్‌, సూపర్‌మార్కెట్ల నిర్వాహకులు వెంటనే ట్రేడ్‌ లైసెన్సులను తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించడం జరిగింది.


Updated Date - 2022-02-06T05:45:09+05:30 IST