Abn logo
Jun 30 2020 @ 00:22AM

మనుషులేనా వాళ్లు?

జార్జిఫ్లాయిడ్‌ మెడ మీద ఆ తెల్లపోలీసు మోకాలును అదిమిపెట్టి, ఊపిరాడడంలేదని ఎంతగా చెబుతున్నా, మరింత మరింత బలంతో నొక్కి ప్రాణం తీశాడు. కళ్లెదుట జరుగుతున్న దాన్ని ఒక అమ్మాయి సెల్‌ఫోన్‌ కెమెరాలో విడియో తీస్తే, ప్రపంచమంతా చూసింది, అమెరికా అట్టుడికింది. చేసిన తప్పుకు తెల్లపోలీసులు కొందరు మెకాళ్ల మీద వంగి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.


తమిళనాడులోని తూతుక్కుడి పోలీసులు జయరాజ్‌, బెన్నిక్స్‌ అనే తండ్రికొడుకులకు గుదద్వారంలో లాఠీలు జొప్పించి, రక్తస్రావం అయ్యే దాకా హింసించి చంపేశారు. రక్తమోడుతున్న ఇద్దరు మనుషులను చూసి కూడా మేజిస్ట్రేట్‌, వారిని ఆస్పత్రికి కాకుండా జైలుకు పంపాడు. జైలు ఆస్పత్రి వైద్యుడు ఆ ఇద్దరినీ చూసి, ఇతర గాయాలతో పాటు పిరుదుల కండరాలు తీవ్రంగా గాయపడ్డాయని, మలద్వారం నుంచి నెత్తురు ఓడుతున్నదని నోట్‌ చేసి కూడా, వారిని ఆస్పత్రికి పంపమని సిఫారసు చేయలేదు. అబద్ధాలతో కప్పిపుచ్చడానికి, సాక్ష్యాలు తారుమారు చేయడానికి సమస్త యంత్రాంగం తాపత్రయపడుతున్నది. ఇప్పుడు, ఆ ఇద్దరు అభాగ్యులు మరణానికి ముందు పడిన నరకయాతనను తలచుకుని తలచుకుని, దేశంలోని మనసున్న మనుషులంతా గుండెలు బాదుకుంటున్నారు. సింగమ్‌ సిరీస్‌ సినిమాలు తీసిన దర్శకుడు హరి, తాను పోలీసును హీరోగా పెట్టి 5 సినిమాలు చేశానని, అందుకు తానిప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని సంచలన ప్రకటన చేశాడు.


తండ్రిది ఊపిరాడని మరణమని, కొడుకుది గుండెపోటని చెప్పి సీఎం ఎడప్పాడి పళనిస్వామి ముందే నిర్ధారణ చేశాడు. సహజమరణం అంటూనే ఇరవైలక్షల పరిహారం కూడా ప్రకటించాడు. తమిళ సమాజం నుంచి కనీవినీ ఎరుగుని రీతిలో వ్యక్తమవుతున్న నిరసనకు భీతిల్లి సిబిఐ విచారణకు అంగీకరించాడు. హత్య కళ్లెదుట కనిపిస్తుండగా, సిబిఐ విచారణ ఎందుకు, 302 సెక్షన్‌ కింద కేసెందుకు పెట్టవు– అంటూ తూతుక్కుడి ఎంపి కనిమొజి కరుణానిధి నిలదీస్తున్నది. ఎమర్జెన్సీ మానవహక్కుల హననం గురించి అధికారపీఠాల మీద నుంచి జ్ఞాపకం చేసుకున్న నాయకులు మాత్రం ఇంకా ఏమీ మాట్లాడలేదు.


జయరాజ్‌ తూతుక్కుడిలో ఒక చిన్న మొబైల్‌ దుకాణం నడుపుతాడు. అతను నాడార్‌ కులస్తుడు. తమిళనాడులో నాడార్లంటే, నిచ్చెనమెట్ల వ్యవస్థలో దళితకులాలకు ఒక అంగుళం ఎగువన ఉంటారు. కానీ, తూతు క్కుడి ప్రాంతంలో నాడార్లు విద్యావంతులుగా, చిన్న చిన్న వ్యాపారులుగా బాగా ఎదిగినవారు. ఆ ప్రాంతంలో నాడార్ల ఎదుగుదల ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన విషయం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట దుకాణం మూసివేత వేళలను జయరాజ్‌ పాటించలేదు. అదీ అతని నేరం. అందుకని, మర్నాడు అతన్ని పోలీసు స్టేషన్‌కు పిలిపించి హింసించడం ప్రారంభించారు. తండ్రికి ఏమయిందోనని తెలుసుకోవడానికి వెళ్లిన కొడుకు బెన్నిక్స్‌ను కూడా అదుపులోకి తీసుకుని కొట్టడం మొదలుపెట్టారు. జూన్‌ 18 నాడు ప్రారంభమైన ఈ ఉదంతం, 22 రాత్రి ఒకరు, 23 తెల్లవారుజామున మరొకరు మరణించడంతో ముగిసింది. 19, 20 తేదీలలో రాత్రింబగళ్లు వారిని పోలీసులు హింసించారు. 21వ తేదీన మేజిస్ట్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఆయన బాధితులిద్దరినీ జైలుకు పంపారు.


ఇక్కడెక్కడా మానవత్వం ఛాయలు కూడా ఎక్కడా కనిపించలేదు. కరోనా వైరస్‌ మనుషులందరి మధ్యా అంతరాలను తొలగించి, అందరినీ ఒకే ప్రాణభయానికి లోను చేసిందని చెప్పుకుంటున్నాము. కానీ, లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో సైతం పోలీసు యంత్రాంగం అధికారమదాన్నే ఆసరా చేసుకున్నది. అధికారమదమే కాదు, అది సామాజిక దురహంకారం కూడా. తూతుక్కుడి ప్రాంతంలో నాడార్ల కంటె ఎగువన ఉన్న శూద్ర కులం కోనార్‌ (సాంప్రదాయికంగా పశుపాలక వృత్తిలో ఉండేవారు)ల పక్షాన స్థానిక పోలీసులు నిలిచి, రెండు కులాల వారి మధ్య స్పర్థలను ప్రోత్సహిస్తున్నారని క్షేత్రస్థాయి విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తండ్రికొడుకులను హింసించి చంపడంలో, పోలీసు అధికారాన్ని ధిక్కరిస్తారా అన్న పంతంతో పాటు, ఇతర సామాజిక అంశాలున్నాయని స్పష్టంగానే తెలుస్తున్నది, జార్జి ఫ్లాయిడ్‌ మెడ నొక్కిన మోకాలులో కూడా తెల్లజాతి దురహంకారమే ఉన్నట్టు.


తూతుక్కుడి హింసలోని మరొక కోణం– బాధితులను హింసించిన తీరు. గుదద్వారంలో లాఠీలను జొప్పించి హింసించడం కేవలం శారీరక హింస కాదు, అందులో లైంగిక హింసా ప్రవృత్తి ఉన్నది. సామాజికంగా నిమ్న వర్గాలను, వారు స్త్రీలా పురుషులా అన్నదానితో నిమిత్తం లేకుండా, లైంగిక హింసకు గురిచేయడం ఆధిపత్య సంస్కృతిలో భాగం. దురదృష్టవశాత్తూ, ఈ దేశంలోని పోలీసు యంత్రాంగంలో, సమస్త భద్రతా వ్యవస్థల్లోనూ కూడా సాంప్రదాయిక ఆధిపత్యధోరణి, హింసాప్రవృత్తి అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. వలసపాలన నుంచి వారసత్వంగా పొందాయి.


జయరాజ్‌, బెన్నిక్స్‌ హత్యలపై సిబిఐ విచారణ సరే, సాధారణ పద్ధతి ప్రకారం హత్యానేరం కింద అభియోగం మోపాలి. దేశంలో ప్రతిరోజు సగటున 5 లాకప్‌ మరణాలు జరుగుతున్నాయి. ఈ దారుణాతి దారుణ హత్యలను దృష్టిలోపెట్టుకుని పోలీసు యంత్రాంగం పనితీరును సమీక్షించి, వారు నాగరికంగా మానవీయంగా ప్రవర్తించడానికి కావలసిన సంస్కరణలను తీసుకురావాలి. దేశంలోని వివిధ పాలకపక్షాలు, సంస్థలు ఈ హత్యలను ఖండించడానికి, ఇటువంటివి జరగడానికి తమ వంతు బాధ్యతను గుర్తించడానికి ముందుకు రావాలి.

Advertisement
Advertisement
Advertisement