బకాయిలు ‘పక్కా’గా వస్తాయా!?

ABN , First Publish Date - 2020-06-06T09:28:20+05:30 IST

పక్కా గృహాల బిల్లుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

బకాయిలు ‘పక్కా’గా వస్తాయా!?

సీఎం నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆశలు


సంగం, జూన్‌ 5 : పక్కా గృహాల బిల్లుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల సీఎం జగన్‌ గృహ నిర్మాణశాఖపై సమీక్షిస్తూ పెండింగ్‌ బకాయిలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.  గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో 4 విడతలుగా 39,500 పక్కా గృహాలను మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ పక్కా గృహాలకు రూ. 1.5 లక్షలు, పీఎంఏవై పథకంలో రూ.2 లక్షలు చొప్పున కేటాయించారు. దీంతో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టారు. మొదటి విడతలో 12,500 గృహాల్లో 11,228 పూర్తయ్యాయి. వీటికి బిల్లులు చెల్లించారు కూడా.


ఆ తరువాత చేపట్టిన పక్కా గృహాల్లో కొన్ని పూర్తవగా, కొన్ని శ్లాబ్‌లెవల్‌, మరికొన్ని రూప్‌లెవల్‌, ఇంకొన్ని బేస్‌మెంట్‌ దశల్లో సుమారు 23,253 గృహాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.67.18 కోట్ల బకాయిలు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. 2019, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో బిల్లులు ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో గత  ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్‌ గృహాల బిల్లులు ఆపేసింది.  గృహా నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం రెండు సార్లు సర్వే చేయించి, జియో ట్యాగింగ్‌ చేశారు. కానీ బిల్లులు మంజూరు చేయలేదు. నిర్మాణాలకు తెచ్చిన అప్పులు పెరిగిపోతున్నాయని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా బకాయిలు చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకోవడంతో అందరిలో ఆశలు రేగుతున్నాయి. హౌసింగ్‌ పీడీ ఎస్వీఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ బకాయిల చెల్లింపులకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-06-06T09:28:20+05:30 IST