ఆర్యన్‌ విడుదలకు 25 కోట్లు అడిగారు!

ABN , First Publish Date - 2021-10-25T06:47:01+05:30 IST

ముంబై తీరంలో నౌకలో రేవ్‌పార్టీలో డ్రగ్స్‌ వ్యవహారం కేసు కొత్త మలుపు తిరిగింది.

ఆర్యన్‌ విడుదలకు  25 కోట్లు అడిగారు!

షారూఖ్‌తో బేరంలో ఎన్‌సీబీ అధికారులు 

18 కోట్లకు దిగొచ్చారు.. వాంఖడేకు 8 కోట్లు

డ్రగ్స్‌ కేసులో సాక్షి సంచలన వ్యాఖ్యలు

తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని 

ఆరోపణ.. భగ్గుమన్న శివసేన, ఎన్‌సీపీ నేతలు

వాంఖడేపై సిట్‌కు డిమాండ్‌ చేస్తామని వెల్లడి

ఖండించిన ఎన్‌సీబీ అధికారులు


ముంబై, అక్టోబరు 24: ముంబై తీరంలో నౌకలో రేవ్‌పార్టీలో డ్రగ్స్‌ వ్యవహారం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) అధికారులు రూ.25 కోట్ల లంచం డిమాండ్‌ చేశారంటూ ఓ సాక్షి వెల్లడించారు. ఆర్యన్‌, ఇతరులఅరెస్టు సమయంలో రేవ్‌పార్టీ జరిగిన నౌకపైనే ఉన్న ప్రైవేటు డిటెక్టివ్‌ కేపీ గోసావిని ఎన్‌సీబీ అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్‌ అరెస్టు తర్వాత.. అతనితో గోసావి దిగిన సెల్ఫీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోసావి పరారీలో ఉన్నారు. అతని వ్యక్తిగత గన్‌మన్‌ ప్రభాకర్‌ సెయిల్‌ స్వచ్ఛంద సాక్షిగా వాంగ్మూలమిచ్చేందుకు ఇటీవల ఎన్‌సీబీ ఎదుట హాజరయ్యారు. ఆదివారం ఎన్‌సీబీ అధికారులపై ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆర్యన్‌ఖాన్‌ అరెస్టయ్యాక.. డీసౌజా అనే వ్యక్తిని గోసావి కలిశాడు. నేను ఆ సమయంలో గోసావి వెంటనే ఉన్నాను. ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారులు రూ. 25 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్లు వారి మాటలను బట్టి తెలిసింది.


ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్న సందర్భంలో లంచం చుట్టే సంభాషణ సాగింది. ఫోన్‌ పెట్టేశాక.. ఎన్‌సీబీ అధికారులు చివరకు రూ. 18 కోట్లు ఇవ్వాలన్నట్లు గోసావి చెప్పారు. ఆ మొత్తంలో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు ఇవ్వాలన్నారు’’ అని మీడియాకు తెలిపారు. తన వాంగ్మూలం తీసుకున్నప్పుడు కూడా ఎన్సీబీ అధికారులు ఖాళీ పంచనామాపై, కొన్ని తెల్లకాగితాలపై సంతకం పెట్టించారని చెప్పారు. గోసావి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం తనకు సమీర్‌ వాంఖడే నుంచి ప్రాణహాని ఉందని సెయిల్‌ ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలున్నాయంటూ కోర్టులో అఫిడవిట్‌ సమర్పించానన్నారు. కాగా.. ఓ చీటింగ్‌ కేసుకు సంబంధించి గోసావిపై పుణె పోలీసులు లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ఎన్‌సీబీ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.


భగ్గుమన్న విపక్షాలు

సెయిల్‌ ఆరోపణలు ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో.. విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. విపక్షాల నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయభ్రాంతులకు గురిచేయిస్తోందని విమర్శించాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే ఈ కేసులో కేంద్రం తీరుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఎన్‌సీబీ లంచం డిమాండ్‌, సాక్షితో తెల్లకాగితాలపై సంతకాల వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీ్‌పవాల్సే పాటిల్‌ను కోరారు. ఎన్‌సీబీ కార్యాలయంలో ఆర్యన్‌ఖాన్‌తో గోసావి ఫోన్‌ మాట్లాడిస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఎన్‌సీబీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ కూడా ఎన్‌సీబీ తీరును ఎండగట్టారు. సమీర్‌ వాంఖడే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలున్నాయని, ముందు నుంచి ఈ డ్రగ్స్‌ కేసు ‘ఫేక్‌’ అని చెబుతూ వచ్చానని ఆయన అన్నారు.


సోమవారం ముఖ్యమంత్రిని కలిసి.. లంచం, ఖాళీ కాగితాలపై సాక్షి సంతకానికి సంబంధించి సిట్‌ దర్యాప్తును కోరుతానని చెప్పారు. కేంద్ర మంత్రి రాందాస్‌ ఆఠవాలే ఈ ఆరోపణలను ఖండించారు. నవాబ్‌ మాలిక్‌ మేనల్లుడు సమీర్‌ఖాన్‌ను ఇంతకు ముందు డ్రగ్స్‌ కేసులో సమీర్‌ వాంఖడే అరెస్టు చేశారని గుర్తుచేశారు. సమీర్‌ వాంఖడే వెనుకబడిన తరగతులకు చెందిన అధికారి కావడం వల్లే.. ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్‌సీబీ ఖండన

ప్రభాకర్‌ సెయిల్‌ ఆరోపణలను ఖండిస్తూ ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(డీడీజీ) ముఠా అశోక్‌ జెన్‌ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సెయిల్‌ తన ఆరోపణలను కోర్టుతో చెప్పుకోవాలే తప్ప.. మీడియాకెక్కకూడదని చెప్పారు. ఈ ఆరోపణలను సమీర్‌ వాంఖడే నిర్ద్వంద్వంగా ఖండించారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-25T06:47:01+05:30 IST