అక్షరానికి 60ఏళ్లు

ABN , First Publish Date - 2021-09-16T03:53:20+05:30 IST

జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గౌరవ పదవులకు, ప్రముఖులకు అక్షర దానం చేసిందీ పాఠశాల. పొదలకూరు మండలంలోని మహమ్మదాపురంలోని ఉన్నత పాఠశాల స్థాపించి 60ఏళ్లు పూర్తి చేసుకుంది.

అక్షరానికి 60ఏళ్లు
60 ఏళ్ల క్రితం నిర్మించిన ఉన్నత పాఠశాల దాత దివంగత దొడ్ల సుబ్బారెడ్డి

మహమ్మదాపురం పాఠశాల ఘనత

‘దొడ్ల’వారి దాతృత్వం

ఎందరో విద్యార్థుల భావితరాలకు మార్గదర్శి


పొదలకూరురూరల్‌, సెప్టెంబరు 15 : జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గౌరవ పదవులకు, ప్రముఖులకు అక్షర దానం చేసిందీ పాఠశాల. పొదలకూరు మండలంలోని మహమ్మదాపురంలోని ఉన్నత పాఠశాల స్థాపించి 60ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్ల కుటుంబీకులు 1961లో ఈ పాఠశాలను నిర్మించారు. అక్షర జ్ఞానంతోనే సమాజంలో మార్పు, అభివృద్ధి సాధ్యమని దాత దొడ్ల సుబ్బారెడ్డి గుర్తించారు. పొదలకూరు మెట్ట ప్రాంతంలో పేదరికం, నిరక్షరాస్యత రాజ్యమేలుతున్న రోజుల్లో తమ కుటుంబానికి చెందిన ఆరు ఎకరాల మామిడితోటను తొలగించి పాఠశాలను నిర్మించారు. మొదట్లో 9వ తరగతి వరకు చదువుకునే అవకాశం కల్పించారు. అనంతరం 10వ తరగతి వరకు ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు విద్యకోసం వచ్చేవారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం దొడ్ల సుబ్బారెడ్డి తన తల్లి శంకరమ్మ పేరిట పాఠశాల పక్కనే 3 ఎకరాల్లో వసతిగృహాలు నిర్మించారు. ప్రతిరోజూ 700 మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. 24 గదుల్లో డైనింగ్‌ హాలు, స్టడీ రూములు నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 3 ప్రభుత్వ వసతిగృహాలు నడుస్తున్నాయి. తమ తాత, తండ్రులు జిల్లాలో విద్యా, వైద్య రంగాలకు చేసిన కృషిని మర్చిపోకుండా అదేదారిన వెళుతున్నారు దొడ్ల సుబ్బారెడ్డి మనుమడు.. దొడ్ల డెయిరీ చైర్మన్‌ దొడ్ల శేషారెడ్డి. 2018లో రూ.71లక్షలు ఖర్చు పెట్టి తరగతి గదులు, వంట గది, గ్రానైట్‌ ప్లోరింగ్‌, విద్యుత్‌, డైనింగ్‌ టేబుల్స్‌తో పాఠశాలను ఆధునీకరించారు. దీంతో పాటుగా శిథిలావస్థకు చేరిన  హాస్టల్‌ భవనాన్ని తొలగించి సీఎస్‌ఆర్‌ కింద సొంత నిధులతో రూ.1.60 కోట్లతో నూతన భవనాలను నిర్మించారు. ఈ భవనాలను కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభించారు.  



Updated Date - 2021-09-16T03:53:20+05:30 IST