జీకేవీధి పీహెచ్‌సీలో వైద్యం అందక ఏఎస్‌ఐ మృతి

ABN , First Publish Date - 2021-12-07T05:38:35+05:30 IST

ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక సోమవారం సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మృతిచెందారు.

జీకేవీధి పీహెచ్‌సీలో వైద్యం అందక ఏఎస్‌ఐ మృతి
మృతి చెందిన ఏఎస్‌ఐ సవరప్ప


గూడెంకొత్తవీధి, డిసెంబరు 6: ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక సోమవారం సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మృతిచెందారు. వివరాల్లోకి వెళితే... గూడెంకొత్తవీధిలో 24 గంటలు సేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇందుకోసం ఇద్దరు వైద్యులను నియమించారు. అయితే వారు స్థానికంగా నివాసం ఉండకుండా... ప్రతిరోజూ చింతపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత ఆస్పత్రిలో కేవలం ఏఎన్‌ఎం, హెల్పర్‌ మాత్రమే ఉంటున్నారు. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు వైద్యుల సేవలు అందడం లేదు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. రాత్రివేళ వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌ నర్సు మందులిచ్చి పంపించేశారు. పరిస్థితి విషమించడంతో ఆమెను కుటుంబసభ్యులు చింతపల్లి సీహెచ్‌సీకి తరలించారు.  ఇదిలావుండగా సోమవారం ఉదయం ఐదు గంటలకు సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ సవరప్పకు గుండెపోటు రావడంతో సహోద్యోగులు జీకే వీధి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అయితే వైద్యులు ఎవరూ లేరంటూ స్టాఫ్‌ నర్సు వైద్యం చేసే ప్రయత్నం చేశారు. సుమారు అరగంట సేపు ఆయనకు ప్రాథమిక చికిత్స కూడా అందలేదు. కనీసం చింతపల్లి సీహెచ్‌సీకి తరలించేందుకు అంబులెన్స్‌ సమకూర్చాలని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కోరినప్పటికీ వాహనం మరమ్మతులకు గురైందని ఆస్పత్రి సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆరు గంటలకు ఏఎస్‌ఐ సవరప్ప తుదిశ్వాస విడిచారు. స్థానిక గిరిజనులు ఈ విషయమై పాడేరు ఐటీడీఏ పీవోకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పీవో 24 గంటలు వైద్యులు రోగులకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సవరప్ప స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని మండలం విరపపురం గ్రామం. ఏఎస్‌ఐ మృతికి సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సానుభూతిని వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-12-07T05:38:35+05:30 IST