భూవివాదంలో ఒకరిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-22T06:56:25+05:30 IST

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో సోమవారం ఉదయం భూవివాదంలో ఒకరిపై హత్యాయత్నం జరిగింది.

భూవివాదంలో ఒకరిపై హత్యాయత్నం
ంఘటనాస్థలంలో బాదితుడు గోలి శ్రీకాంత్‌

- పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకం

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 21 : కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో సోమవారం ఉదయం భూవివాదంలో ఒకరిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్‌(23)పై కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన బండారి మారుతి తల్వార్‌తో మెడపై, చేతులపై నరికి హత్యాయత్నం చేశాడు. బాధితుడు శ్రీకాంత్‌ ప్రస్తుతం ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా అతని ఆరోగ్య పరిసస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన బండారి మారుతి విద్యుత్‌ శాఖలో మానకొండూర్‌ మండలం చెంజర్లలో లైన్‌మన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మారుతి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడు.  బొమ్మకల్‌ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్‌ మూడెళ్ల కిందట బండారి మారుతికి 20 లక్షల రూపాయలు చెల్లించి కొత్తపల్లి శివారులో 14 గుంటల భూమి కొనుగోలు చేశాడు. అయితే అప్పటి నుంచి భూమిని శ్రీకాంత్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతున్నా కావాలని జాప్యం చేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కరీంనగర్‌లోని కోర్టు వద్ద శ్రీకాంత్‌కు మారుతి కలిశాడు. రేకుర్తి శివారులోని భూమిని మంగళవారం రిజిస్ట్రేషన్‌ చేస్తానని శ్రీకాంత్‌ను నమ్మించి భూమి వద్దకు ఇద్దరు కలిసి వెళ్లారు. రేకుర్తి శివారులోని భూమి పక్కన ఒర్రె వద్ద ఆగారు. ఆ తరువాత మారుతి అక్కడే తనవెంట తెచ్చుకున్న మద్యం సేవించాడు. తన భూమి హద్దులు చూపిస్తానని చెప్పగా కొలతలు తీసేందుకు టేప్‌పట్టుకున్న శ్రీకాంత్‌ను తల్వార్‌తో శ్రీకాంత్‌ మెడ, చేతులపై విచక్షణారహితంగా నరికాడు. స్పృహకోల్పోయి రక్తపుమడుగులో పడిపోయిన శ్రీకాంత్‌ చనిపోయాడని భావించి మారుతి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటికి మెళకువవచ్చిన శ్రీకాంత్‌ తన బంధువు తోట కిరణ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. సంఘటనాస్థలానికి వెళ్లిన కిరణ్‌, మరో వ్యక్తి వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేయగా 108 అంబులెన్స్‌లో బాధితుడు శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువు తోట కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌ రూరల్‌ సీఐ పీ విజ్ఞాన్‌రావు తెలిపారు. 


ఫ శ్రీకాంత్‌పై హత్యాయత్నం ఘటనలోనిందితుడైన బండారి మారుతి 2012 ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల ప్రాంతంలో కొత్తపల్లి మండలం రేకుర్తిలో భూవివాదంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సప్తగిరి కాలనీకి చెందిన మేన్నేని కిషన్‌రావును కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆ రోజున కిషన్‌రావు సంఘటనాస్థలంలోనే ప్రాణాలుకోల్పోయాడు. మారుతి, కిషన్‌రావు మరి కొందరు కలిసి అప్పుడు రియల్‌ఎస్టేట్‌వ్యాపారం చేసేవారు. రియల్‌ఎస్టేట్‌కు సంబంధించిన భూములు, డబ్బుల విషయంలో వివాదం తలెత్తగా కిషన్‌రావు హత్య సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసు కోర్టులో కొట్టుడుపోయింది. 

ఫ ఒంటరిగా రప్పించి...

శ్రీకాంత్‌కు భూమి హద్దులు చూపిస్తానని బైక్‌పై వెంట సంఘుటనాస్థలానికి బాధితుడు శ్రీకాంత్‌ను ఒంటరిగా తీసుకెళ్లి అతనిపై పథకం ప్రకారమే తల్వార్‌తో దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాంత్‌ తన బావ కిరణ్‌తో కలిసి వస్తానని మారుతికి చెప్పగా ఒక్కడివే రావాలని సూచించనట్లు బాధితుడు తెలిపాడు. ఈ సంఘటన సమయంలో నిందితుడు ఒక్కడే ఉన్నాడా? లేక మరెవరైనా సహకరించారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం ఇద్దరు కలిసి సేవించారా? లేక మారుతి ఒక్కడే మద్యం సేవించాడా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు.

ఫ సంఘటనా స్థలం పరిశీలన.. 

సంఘటనాస్థలాన్ని కరీంనగర్‌ రూరల్‌ సీఐ పీ విజ్ఞాన్‌రావు, కొత్తపల్లి ఎస్‌ఐ ఎల్లయ్యగౌడ్‌ లు పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో కొందరిని పోలీసులు విచారించారు. నిందితుడు అక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాడు? అతనితో ఇంకెవరెవరు ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. సంఘటనా స్థలంలో వాటర్‌బాటిల్‌, మద్యం సీసా ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. 

ఫ సమాచారం అందించాలి..

గోలి శ్రీకాంత్‌పై హత్యయత్నం చేసిన బండారి మారుతి ఫొటోలను కరీంనగర్‌ రూరల్‌ సీఐ పీ విజ్ఞాన్‌రావు మీడియాకు విడుదల చేశారు. నిందితుడి సమాచారం తెలిసిన వారు సీఐ ఫోన్‌ 9440795109, ఎస్‌ఐ ఫోన్‌ 9440900974కు సమాచారం అందించాలని కోరారు. 


Updated Date - 2021-06-22T06:56:25+05:30 IST