ముంబైలో అంతే! కేన్సర్ రోగులు, బిచ్చగాళ్లు, వలస కార్మికులు అందరూ కలిసి..

ABN , First Publish Date - 2020-04-05T01:09:23+05:30 IST

నగరంలో ఇప్పుడు బిచ్చగాళ్లు, వలస కార్మికులు, కేన్సర్ రోగులు అందరూ ఒక షెల్టర్ హోంలో నివసిస్తున్నారు.

ముంబైలో అంతే! కేన్సర్ రోగులు, బిచ్చగాళ్లు, వలస కార్మికులు అందరూ కలిసి..

ముంబై: నగరంలో ఇప్పుడు బిచ్చగాళ్లు, వలస కార్మికులు, కేన్సర్ రోగులు అందరూ ఒక షెల్టర్ హోంలో నివసిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన సామాజిక దూరం ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు. వైరస్ ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియక అందరూ భయం భయంగా గడుపుతున్నారు. బాంద్రాలోని షెల్టర్ హోంలో ఆహార పొట్లం కోసం నిలబడిన 23 ఏళ్ల సాహిబా వేదన వర్ణించనలవి కానిది. ఆమె 18 నెలల కుమారుడు నూర్ అలీకి వైరస్ ఎక్కడ సోకుతుందోననే బాధ ఆమెను వేధిస్తోంది. అలీ కేన్సర్ రోగి. టాటా మెమోరియల్ ఆసుపత్రిలో ఇప్పటికే నాలుగు సెషన్ల కీమోథరపీ ముగిసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ తర్వాత వారిని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఉత్తర భారతీయ సంఘ్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ హోంకు తరలించారు. అదే ఆసుపత్రి నుంచి మొత్తం 17 మంది కేన్సర్ రోగులను షెల్టర్ హోంకు తరలించారు. 


మిగతా వారితో పోలిస్తే కేన్సర్ రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వారు మిగతా వారితో వీలైనంత దూరంగా ఉండాలి. అయితే, ఈ షెల్టర్‌లో మాత్రం మిగతా వారితో అతి దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ నేలమీదే నిద్రపోతున్నారు. ఒకరికి మరొకరు తగులుతున్నారు. దీంతో సాహిబా మరింత భయపడుతోంది. తమకు ఇక్కడి కంటే రోడ్డుపైన ఉన్నప్పుడే బాగుండేదని సాహిబా భర్త 25 ఏళ్ల జాఫర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ షెల్టర్‌లో తమలాంటి కేన్సర్ రోగులతోపాటు బిచ్చగాళ్లు, వలస కూలీలు కూడా ఉన్నారని తెలిపాడు. కాగా, రోగులను, వారి కుటుంబ సభ్యులను పరేల్‌లోని ప్రత్యామ్నాయ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ముంబై మునిసిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ (ప్లానింగ్) డాక్టర్ సంగీత హస్నాలే తెలిపారు.  

Updated Date - 2020-04-05T01:09:23+05:30 IST