కొవిడ్‌ కేంద్రాల్లో బాధితుల కష్టాలు

ABN , First Publish Date - 2021-05-10T06:25:52+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో కరోనా బాధితుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

కొవిడ్‌ కేంద్రాల్లో బాధితుల కష్టాలు
జిల్లా ఆస్పత్రిలో వేడి నీళ్ల కోసం బారులు తీరిన ప్రజలు

ఆకలి కేకలు!

కొవిడ్‌ కేంద్రాల్లో బాధితుల కష్టాలు

 సకాలంలో టిఫిన్‌, భోజనం అందక అవస్థలు 

జిల్లా సర్వజనాస్పత్రిలో ఆదివారం 

ఆకలితో  అలమటింపు అరకొర వసతులతో అల్లాడిపోతున్న బాధితులు

అనంతపురం వైద్యం, మే 9: 

కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో కరోనా బాధితుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కరోనా బారి నుంచి వారిని కాపాడేందుకు బలవర్దక ఆహారం ఇవ్వాల్సి ఉందనీ, అందుకు ప్రభుత్వం ప్రజాధనం భారీగా వెచ్చిస్తున్నా.. ప్రయోజనం లేదు. క్షేత్రస్థాయిలో బాధితులకు ఆకలి కష్టాలు తప్పట్లేదు. సకాలంలో టిఫిన్‌, భోజనం అం దట్లేదు. ఎప్పుడో వచ్చినా.. నాణ్యత, రుచిగా ఉండట్లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం తాగునీరు కూడా లేద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట తెచ్చుకుందామంటే హోటళ్లు బంద్‌ కావటంతో ఆకలితో అలమటిస్తున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆదివారం జిల్లా సర్వజనాస్పత్రిలో కొవిడ్‌ బాధితులకు ఉదయం 9 గంటలు దాటినా రాగిమాల్ట్‌ లేదు, పాలు ఇవ్వలేదు. చివ రికి టిఫిన్‌ కూడా సరఫరా చేయలేదు. 600 మంది వరకు ఇక్కడ బాధితులు చికిత్స పొందుతున్నారు. వారందరూ ఆకలితో అలమటించిపోయారు. తట్టుకోలేక కొందరు బయటకు వచ్చి, హోటళ్ల నుంచి తీసుకెళ్లే ప్రయ త్నం చేశారు. హోటళ్లు పూర్తి బంద్‌ కావడంతో టిఫిన్‌ కూడా దొరకలేదు. ఆస్పత్రి చుట్టపక్కల అంతా తిరిగినా ఏమీ దొరక్కపోవటంతో మరింత ఆవేదనతో కుంగిపోయారు. బాత్రూమ్‌లో కూడా నీరు రావడం లేదనీ, తాగడానికి నీరు ఇవ్వడం లేదని జిల్లా ఆస్పత్రిలోని పరిస్థితిని వివరిస్తూ కరోనా బాధితులు ఆంధ్రజ్యోతి వద్ద కంటతడి పెట్టారు. తమ పేర్లు చెప్పకండి కానీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తమ కష్టాలు తీర్చేలా చూడాలని వేడుకున్నారు. సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ యూనిట్లలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు కూడా సకాలంలో టిఫిన్‌, భోజనం ఇప్పటికీ అందించడం లేదనీ, దీం తో అవస్థలు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రంగు, ప్యాకింగ్‌ మారింది కానీ రుచి, నాణ్యత ఉండడం లేదనీ, దీంతో కడుపునిండా తినలేకపోతున్నామని బాధితులు చెబుతున్నారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.350 భోజనం కోసం వ్యయం చేస్తున్నా నాణ్యత, రుచిగా అందివ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి ఎంతో అవసరం. అది కావాలంటే మంచి ఆహారం అందించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా పౌష్టికాహారం సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.     గతేడాది కూడా కొవిడ్‌ బాధితుల భోజన ఖర్చు విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో రోగులకు చికిత్సతోపాటు మంచి పౌష్టికాహారం అందిస్తేనే వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఉన్నతాధికారులు ఆలోచించాలి. భోజనం సరఫరా విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి, నాణ్యత, రుచి ఉన్న భోజనం, టిఫిన్‌ సకాలంలో అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.


 ఒక్క రోజులో 2039 కరోనా కేసులు

మహమ్మారికి మరో 8 మంది బలి

అనంతపురం వైద్యం, మే 9 : కరోనా వైరస్‌ విశ్వ రూపం చూపుతోంది. దీంతో రోజురోజుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2039 మంది కరోనా బారిన పడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ మహమ్మారికి మరో 8 మంది మృతి చెందా రన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 98777 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 83693 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. కరోనా దెబ్బకు 729 మంది మరణించారు. ప్రస్తు తం 14355 మంది ఇంకా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లాలో వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత నెల ముందు వరకూ జిల్లాలో 70వేలలోపు ఉన్న కేసులు   లక్షకు చేరుకుంటున్నాయి. దీంతో జిల్లాలో అధికార యం త్రాంగం అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 









Updated Date - 2021-05-10T06:25:52+05:30 IST