పింఛన్ల కోత

ABN , First Publish Date - 2021-08-03T06:35:07+05:30 IST

కరువు జిల్లాలో పింఛన్లకు కోత పెట్టారు. గత నెలతో పోలిస్తే జిల్లావ్యాప్తంగా 6571 పింఛన్లను తొలగించారు.

పింఛన్ల కోత

అత్యధికంగా ఒంటరి మహిళలవి తొలగింపు

ఈ నెలలో 6571 కట్‌.. మరికొన్ని కోత పెట్టేందుకు రంగం సిద్ధం

అనంతపురం వ్యవసాయం, ఆగస్ట్టు 2: కరువు జిల్లాలో పింఛన్లకు కోత పెట్టారు. గత నెలతో పోలిస్తే జిల్లావ్యాప్తంగా 6571 పింఛన్లను తొలగించారు. ఇటీవల ఒంటరి మహిళలు, వితంతు పింఛన్లపై సర్వే చేశారు. బియ్యం కార్డుల్లో భర్తల పేరున్నా.. కొందరు ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్లు తీసుకుంటున్నట్లు తేల్చారు. అలాంటి వారికి నోటీసులు జారీ చేశారు. తగిన సమయం ఇవ్వకుండానే కొందరు ఒంటరి మహిళలు, వితంతువుల పింఛన్లను తొలగించినట్లు ఆరోపణలున్నాయి. పలు రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి డీఎంఅండ్‌హెచ్‌ఓ స్కీం కింద పింఛన్లు ఇస్తున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకునే వారికి పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. ఈ నెలలో డీఎంహెచ్‌ఓ, కిడ్నీ బాధితుల పింఛన్లను తొలగించారు. క్షేత్రస్థాయిలో సరైన విచారణ చేయకుండానే పలు రకాల జబ్బులతో బాధపడేవారి పింఛన్లను తొలగించినట్లు బాధితులు వాపోతున్నారు. ఎన్నడూలేని విధంగా ఈసారి వృద్ధాప్య పింఛన్లను తొలగించడం గమనార్హం. గత నెలలో జిల్లాలో 5.25 లక్షల మందికి రూ.129.79 కోట్లు మంజూరు చేశారు. ఈ నెలలో 5.18 లక్షల మందికి రూ.126.69 కోట్లు కేటాయించారు. గత నెలతో పోలిస్తే 6571 వేల మంది పింఛన్లను కోత వేశారు. సర్వే, కొత్త నిబంధనల పేరుతో ఈ నెలలో మరికొన్ని పింఛన్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయావర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


అర్హులకు అన్యాయం జరగదు

పింఛన్లకు సంబంధించి అర్హులకు అన్యాయం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాం. జిల్ల్లాలో కొందరు మహిళలు భర్తలున్నా ఒంటరి మహిళలు, వితంతుల కేటగిరిలో పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. మిగతా కేటగిరిల్లో నిబంధనల మేరకు పింఛన్లను తొలగించాం. పొరబాటున తొలగించి ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుతాం.

- నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ


రెండోరోజు ఆలస్యంగా పింఛన్‌ పంపిణీ

మధ్యాహ్నం ప్రారంభం

లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

అనంతపురం వ్యవసాయం, ఆగస్టు 2: జిల్లాలోని పలు సచివాలయాలకు  రెండో రోజు పింఛన్ల సొమ్ము జమ చేయడంలో జాప్యమైంది. అనంతపురం నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. ఆదివారం తొలిరోజు జిల్లా వ్యాప్తంగా సగం సచివాయాల పరిధిలోనే పింఛన్ల పంపిణీ కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా మిగిలిన సచివాయాలకు డబ్బు జమైంది. ఉదయం కొంత సొమ్మును మాత్రమే జమ చేయడంతో మిగతా డబ్బు జమైన తర్వాత ఒకేసారి మొత్తం డ్రా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండోరోజు మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని వలంటీర్లు ప్రారంభించారు. తొలిరోజు పింఛన్‌ ఇవ్వకపోవడంతో సోమవారమైనా ఇస్తారని లబ్ధిదారులు ఎదురుచూశారు. మధ్యాహ్నం వరకు వలంటీర్లు రాకపోవడంతో పింఛన్‌దారులు అయోమయానికి లోనయ్యారు. మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రిదాకా  డబ్బు ఇవ్వడంతో హమ్మయ్యా అంటూ పింఛన్‌దారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల జిల్లాకు 5.18 లక్షల మందికి రూ.126.69 కోట్లు మంజూరు చేశారు. రెండు రోజుల్లో  90.63 శాతం పింఛన్‌ డబ్బు పంపిణీ చేశారు. మిగిలిన వారికి మంగళవారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి పేర్కొన్నారు.



Updated Date - 2021-08-03T06:35:07+05:30 IST