అఆల బడికి గండం..!

ABN , First Publish Date - 2021-08-02T06:18:02+05:30 IST

సర్కారీ నిరంకుశ, ప్రజావ్యతిరేక విధానాల వల్ల బడికి గండం ఏర్పడింది. వందలాది ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది.

అఆల బడికి గండం..!

ఎన్‌ఈపీతో జిల్లాలో 313 ప్రైమరీ స్కూళ్లు అవుట్‌..?

ఉన్నత పాఠశాలల్లో విలీనానికి వేగంగా అడుగులు

వ్యతిరేకత వస్తున్నా.. పట్టించుకోని సర్కారు

అనంతపురం విద్య, ఆగస్టు 1: సర్కారీ నిరంకుశ, ప్రజావ్యతిరేక విధానాల వల్ల బడికి గండం ఏర్పడింది. వందలాది ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. అదే జరిగితే వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది టీచర్లు అవస్థలు పడక తప్పదు. కొన్ని ఊళ్లలో ఊరి బడి ఇక కనిపించదా..? అంటే అవునన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. మేధావులు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ప్రైమరీ స్కూళ్లను సంస్కరణల పేరుతో ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడానికి సర్కారు అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో వందలాది పాఠశాలలు కనుమరగవనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలుతో జిల్లాలో 313 ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.


వెనక్కి తగ్గినట్టే తగ్గి...

రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు చేస్తున్నామంటూ విద్యాశాఖ ప్రైమరీ స్కూళ్లను విభజించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ప్రైమరీ స్కూళ్ల విభజనను ఎమ్మెల్సీ, మేధావులు, నిపుణులు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టే తగ్గి... తర్వాత కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చి, పంతం నెగ్గించుకునే యోచనలో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైస్కూల్‌కు 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలన్న కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా హైస్కూల్‌ కాంపౌండ్‌ పరిధిలో ఉన్న, ఆనుకుని ఉన్న, 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసే యత్నాల్లో ఉన్నట్లు కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 68 హైస్కూళ్ల కాంపౌండ్‌ పరిధిలో, 98 కాంపౌండ్‌కు అనుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 147 ప్రాథమిక పాఠశాలలు.. హైస్కూళ్లలో 250 మీటర్ల పరిధిలో ఉన్నట్లు తేల్చారు. జిల్లావ్యాప్తంగా 313 ప్రైమరీ స్కూళ్లలో ఈ విద్యా ఏడాది నుంచి నూతన జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అది కార్యరూపం దాల్చితే ఊరి బళ్లు (ప్రైమరీ స్కూళ్లు) 313 మాయం కానున్నాయనడంలో సందేహం లేదు. విద్యాశాఖ మొండి వైఖరిపై ఉప్యాధాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మౌలిక వసతులు కల్పించకుండా, మానవవనరుల కల్పన లేకుండా పాఠశాలల విలీనానికి అడుగులేయడంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-08-02T06:18:02+05:30 IST