ప్రజాస్వామ్యమా... నియంతృత్వమా...?

ABN , First Publish Date - 2021-07-30T06:20:27+05:30 IST

ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పోకడ నడుస్తోందా..? ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న పరిణామాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి.

ప్రజాస్వామ్యమా... నియంతృత్వమా...?

రెండో డిప్యూటీ మేయర్‌ ఎవరో తెలియదట..!

కార్పొరేటర్లకు ఉదయం వరకు కూడా 

తెలియని దౌర్భాగ్యం

ప్రజాప్రతినిధులకే విలువ

ఇవ్వకపోతే ప్రజలకేం ఇచ్చినట్లు..?

ఎంపీ ఉత్సవ విగ్రహమేనా..?

నేడు రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

అనూహ్యంగా తెరపైకి కోగటం పేరు..!

అనంతపురం కార్పొరేషన్‌, జూలై 29: ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పోకడ నడుస్తోందా..? ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న పరిణామాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రజల వద్దకే పాలన తెస్తామని రాజకీయ పార్టీల నేతలు గొప్పలు చెబుతున్నారు... కానీ పాలకవర్గంలో కీలక పదవుల్లో ఆసీనులయ్యే వారి పేర్లు ముందురోజు రాత్రికి కూడా తెలియకపోవడం విమర్శలకు తావిస్తోంది. దశాబ్దాలుగా నడుస్తున్న సీల్డ్‌కవర్‌ వ్యవస్థనే ఇంకా కొనసాగిస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో అపవాదును మూటగట్టుకుంటున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలో మా త్రమే పేరును ప్రకటించారు. శుక్రవారం ఉదయం కార్పొరేషన్‌ రెండో డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ సీటులో  ఎవరు కూర్చుంటారో కార్పొరేటర్లకు కూడా ఉదయం వరకు  తెలియదట. తొలుత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ విషయంలోనూ ఇలాగే సాగింది. మేయర్‌ పేరు ఎన్నిక ముందురోజు తె లిసింది. మొదటి డిప్యూటీ మేయర్‌ పేరు రాత్రి కీలక కార్పొరేటర్లకు, ఉదయం ప్రమాణ స్వీకారానికి గంట ముందు మాత్రమే మిగిలిన వారికి తెలిసింది.


అదేనా వారికిచ్చే విలువ...?

రెండురోజుల క్రితం ఓ కార్పొరేటర్‌ తన సన్నిహితుడితో ఇలా ఆవేదన వ్యక్తం చేశారట. ఇప్పటివరకు కార్పొరేటర్లందరికీ ఒకరికొకరు పరిచయం పేరుతో గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు చేయలేదనీ, ప్రమాణ స్వీకారం చేసి వచ్చేశామనీ, చాలామంది కొత్తగా గెలిచారనీ, ఎవరెవరో కూడా పరిచయం లేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారట. నగరపాలక సంస్థ పరిధిలో 50 మంది కార్పొరేటర్లున్నారు. మేయర్‌, మొదటి డిప్యూటీ మేయర్‌ విషయంలో ఎవరనేది చెప్పకుండా మ్యానేజి చేసేశారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎవరనేది కూడా కార్పొరేటర్లకు చెప్పలేదట. వారి అభిప్రాయాలు తీసుకోకపోయినా కనీసం పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండాల్సిన ఆంతర్యమేంటో అంతుబట్టడం లేదు. కొందరు కార్పొరేటర్లు రెండో డిప్యూటీ ఎవరికంటూ...? మీడియా వారికి ఫోన్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేకపోతే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


ఎంపీకి కూడా తెలియకుండానా...?

నగర పాలక సంస్థ పాలకవర్గం విషయంలో అనంతపురం ఎంపీ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోతున్నారా...? ప్రస్తుతం స ర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మేయర్‌, డి ప్యూటీ మేయర్‌ ఎన్నికరోజు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎంపీ తాడిపత్రిలో హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆయన ఇతర ము న్సిపల్‌ చైర్మన్ల విషయంలో కూడా కల్పించుకున్న దాఖలా లు కనిపించలేదు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎవరవుతున్నారనే విషయం తెలుసుకుంటున్నారో, లేదో కూడా తెలియని పరిస్థితి.


అనూహ్యంగా కోగటం పేరు...!

నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా అనూహ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్‌ను ఎన్నిక చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల నుంచి రెడ్లకే కేటాయిస్తున్నట్లు అంతర్గత సమాచారంగా బయటకు పొక్కింది. మొదటి నుంచి పోటీలో ఉంటున్న కోగటం విజయభాస్కర్‌రెడ్డి రెండో డిప్యూటీని దక్కించుకుంటున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన ఫ్లెక్సీలు కూడా సిద్ధం చేయించేశారట. మరి రాత్రికి రాత్రి ఇంకా ఏమైనా తెరవెనుక వ్యవహారం నడుపుతారా...? అనే సందేహాలు లేకపోలేదు. ఏదేమైనా ఉదయం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. హిందూపురం, గుంతకల్లుతోపాటు మరో రెండు మున్సిపాలిటీల్లో రెడ్డి సామాజికవర్గానికే రెండో వైస్‌చైర్మన్‌ పదవులు కట్టబెట్టనున్నారు.

Updated Date - 2021-07-30T06:20:27+05:30 IST