శింగనమల ఎమ్మెల్యే పద్మావతి స్థానంలో.. పెద్దారెడ్డి హల్‌చల్!

ABN , First Publish Date - 2021-01-21T06:51:54+05:30 IST

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో..

శింగనమల ఎమ్మెల్యే పద్మావతి స్థానంలో.. పెద్దారెడ్డి హల్‌చల్!
తహసీల్దార్‌ కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ఇదేంటి..?

శింగనమల నియోజకవర్గంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెత్తనమా?

విస్తుపోతున్న మద్దతుదారులు, కార్యకర్తలు

యల్లనూరు తహసీల్దార్‌ కుర్చీలో  పెద్దారెడ్డి

సొంత మండలంలో అధిపత్యం కోసం పాకులాట

భోగాతికి పెరుగుతున్న ప్రాధాన్యం

వైసీపీలో తీవ్రమవుతున్న వర్గ పోరు


యల్లనూరు(అనంతపురం): మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి బుధవారం హల్‌చల్‌ చేశారు. అక్కడి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘స్పందన కార్యక్రమానికి వస్తా.. మీ పనితీరు ఏమిటో చూస్తాన’ంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన బాగోలేదనీ, టీడీపీ కార్యక్రమంగా స్పందన కార్యక్రమాన్ని మార్చవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే తహసీల్దార్‌ ఎక్కడ అంటూ అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్‌ లేకపోవడంతో అక్కడే ఉన్న ఈఓఆర్డీ విజయశేఖర్‌ నాయుడుతో మాట్లాడి, అధికారుల పనితీరు బాగోలేదనీ, టీడీపీ వర్గీయులకు ఎలా వత్తాసు పలుకుతారని మండిపడ్డారు. శింగనమల ఎమ్మెల్యే పద్మావతి స్థానంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హల్‌చల్‌ చేయటం అటు అధికారులు, ఇటు పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. శింగనమలలో తాడిపత్రి ఎమ్మెల్యే పెత్తనం ఏమిటని అక్కడి పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.


సొంత మండలమైన యల్లనూరులో తన అధిపత్యాన్ని నిలుపుకునేందుకు, అధికారుల్లో పట్టు సాధించేందుకు తనకు సంబంధంలేని శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జోక్యం చేసుకోవటాన్ని బట్టి చూస్తే అధికార పార్టీలో అధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కేవలం మండలంలో పట్టు నిలుపుకునేందుకు, తన వర్గానికి అండగా ఉండాననే సంకేతాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌ కార్యాలయాన్ని వేదికగా తీసుకున్నారన్న ప్రచారం ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంత మండలమైన యల్లనూరుపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డితో కూడా పె ద్దారెడ్డి వర్గం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందని చర్చించుకుంటున్నారు. వివిధ కాంట్రాక్ట్‌ పనులతోపాటు స్థానిక సమస్యలపై మాత్రమే ఎమ్మెల్యే వర్గాన్ని కలుస్తోందన్న ప్రచారం సాగుతోంది.


ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ప్రత్యర్థిగా ఉన్న అదే పార్టీకి చెందిన భోగాతి నారాయణరెడ్డి మండలంలో అధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఎమ్మెల్యే వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పెద్దారెడ్డి కన్నా భోగాతి వర్గానికే ఎమ్మెల్యే పద్మావతి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికే పరిమితం కావటంతో మండలంలో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని పలువురు అనుచరులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని రోజులుగా తలెత్తుతున్న వరుస ఘటనలతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి యల్లనూరు మండలంపై దృష్టిపెట్టారని తెలుస్తోంది. మండలంలో పట్టు సడలకుండా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మేడికుర్తి, పాతపల్లి, వేములపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి, ముఖ్య అనుచరులను కలుసుకుని, రాజకీయ పరిస్థితులపై చర్చించారని సమాచారం. రాబోయే పంచాయతీ, మండల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బోగస్‌ ఓట్లు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి.


పెద్దారెడ్డి వర్గం కూడా బోగస్‌ ఓట్లపై దృష్టి పెట్టిందన్న ఫిర్యాదులు రెవెన్యూ అధికారులకు అందాయి. అనుచరులు చేర్చుతున్న బోగస్‌ ఓట్లపై రెవెన్యూ అధికారులు స్పందించకుండా వారిపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్దారెడ్డి వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే పాతపల్లిలో పెద్దారెడ్డి వర్గం, వేములపల్లిలో భోగాతి అనుచరులు బోగస్‌ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారన్న ప్రచారం ఉంది. నాలుగు రోజుల క్రితం పాతపల్లిలో యువతి, యువకుడి అదృశ్యంపై పెద్దారెడ్డి, భోగాతి వర్గాలు కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌ వద్ద ఘర్షణకు దిగాయి. ఇందుకు సంబంధించి భోగాతి వర్గానికి చెందిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పాతపల్లిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పెద్దారెడ్డి, భోగాతి వర్గాలు కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రాబోయే పంచాయతీ, మండల ఎన్నికల్లో అధిపత్యం కోసం పెద్దారెడ్డి, భోగాతి వర్గాలు ఇప్పటి నుంచే చేస్తున్న ప్రయత్నాల వల్ల సొంత పార్టీలో కుంపటి ఏర్పాటవుతోంది. ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-01-21T06:51:54+05:30 IST