వైభవం.. నెట్టికంటి గ్రామోత్సవం..

ABN , First Publish Date - 2021-04-14T06:41:59+05:30 IST

ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి గ్రామోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది.

వైభవం.. నెట్టికంటి గ్రామోత్సవం..
అలంకారంలో నెట్టికంటి మూల విరాట్‌..

గుంతకల్లు, ఏప్రిల్‌ 13: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి గ్రామోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది. స్వామివారి ఆలయానికి ప్రముఖ రోజుల్లో ఒకటైన మంగళవారం ఉగాది పర్వదినం రావటంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేకువనే స్వామివారి మూలవిరాట్‌కు అర్చకులు సుప్రభాత సేవ, మహాభిషేకం నిర్వహించి, బంగారు కవచం, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకారాలు చేశారు. గుంతకల్లు, కసాపురం, మద్దికెర, బుగ్గసంగాల, దోసలుడికి తదితర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్లవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని వేద పండితులు, అర్చకుల అధ్వర్యంలో నిర్వహించారు. 7 గంటలకు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వాముల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఆశీనులను చేసి, రథంపై అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సుగుణమ్మ, ట్రస్టుబోర్డు సభ్యుల ఆధ్వర్యంలో పూజలు చేసి, గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని సీతారాముల ఆలయం వరకు గ్రామోత్సవం సాగింది. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు.


ఆలయంలో నేటి ఉత్సవాలు 

ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం ఆలయంలో బుధవారం పూజాదికాలతోపాటు సాయంత్రం 4 గంటలకు రథాంగ హోమం, సంప్రోక్షణ, బలిహరణ పూజలు కొనసాగుతాయి. సాయంత్రం 6 గంటలకు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను అలంకరించి, రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానం, పద్మశ్రీ ఘంటసాల కల్చరల్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సంయుక్తాధ్వర్యంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భక్తి గీతాలాపనలతో భక్తులను అలరించనున్నారు.


పంచాంగ పఠనం గావిస్తున్న డాక్టర్‌ కేటీవీ రాఘవన్‌



ప్రశాంతి నిలయంలో ఉగాది ఉత్సవాలు


పుట్టపర్తి: స్థానిక ప్రశాంతి నిలయంలో ఉగాది ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సాయికుల్వంత్‌లోని సత్యసాయి మహాసమాధికి ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు. అనంతరం విద్యార్థుల వేదపఠనంతో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పంచాంగకర్త డాక్టర్‌ కేటీవీ రాఘవన్‌ ప్లవనామ సంవత్సర పంచాంగ పఠనం చేపట్టారు. పంచాంగ కర్తను సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ శాలువాతో సన్మానించారు. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.



Updated Date - 2021-04-14T06:41:59+05:30 IST