Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆత్రేయపురం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లల్లోనూ   

రూ.1.4 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 7: ఆత్రేయపురం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జమ్ము వెంకట వరప్రసాద్‌ నివాసంలో ఏసీబీ దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఏకకాలంలో రాజమహేంద్రవరం, ఆత్రేయపురం, కాకినాడ, గుణదల, తెలంగాణ రాష్ట్రంలోని నిజాంపేట ప్రాంతాల్లోని వరప్రసాద్‌ బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరంలోని ఆయన నివాసానికి ఏసీబీ ఇన్‌చార్జి ఏఎస్పీ సౌజన్య నేతృత్వంలో డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు వి.పుల్లారావు, డి.వాసుకృష్ణ, ఎస్‌ఐ ఎస్‌.   విల్సన్‌బాబు, సిబ్బంది చేరుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు రెండు ప్లాట్లు, ఒక జి ప్లస్‌ 2 భవనం, రెండు ఇంటి స్థలాలు, ఒక కారు, బంగారం, బైక్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, బ్యాంక్‌ బ్యాలన్స్‌ కలిపి మొత్తం రూ.2.5 కోట్లు ఆస్తులు వున్నాయని, వాటిలో రూ.1.4 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి వున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.  వరప్రసాద్‌ను ఏసీబీ స్పెషల్‌ జడ్జి కోర్టులో హాజరుపరుస్తామని వారు తెలిపారు.  


ఆత్రేయపురం: జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జేవీవీ ప్రసాద్‌  ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేంద్రప్రసాద్‌  ఆధ్వర్యంలో అధికారులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. 


జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో...

కాకినాడ క్రైం: ఆత్రేయపురం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వరప్రసాద్‌ భార్య ఎం.సుధారాణి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చిట్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు, సిబ్బంది తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 


Advertisement
Advertisement