బాబాలకు దానం చేయడానికి.. అమ్మాయి ఒక ప్రాపర్టీ కాదు

ABN , First Publish Date - 2022-01-29T17:23:36+05:30 IST

బాబాలకు, స్వామీజీలకు దానం చేయడానికి...

బాబాలకు దానం చేయడానికి.. అమ్మాయి ఒక ప్రాపర్టీ కాదు

ఇది కలచివేసే విషయం: ఔరంగాబాద్‌ కోర్టు

ముంబై, జనవరి 28: బాబాలకు, స్వామీజీలకు దానం చేయడానికి... అమ్మాయి ఆస్తి (ప్రాపర్టీ) కాదని ముంబై హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో 17 ఏళ్ల ఓ బాలికను శంకేశ్వర్‌ ధక్నే అనే బాబాకు సదరు బాలిక తండ్రి దానంగా ఇచ్చాడు. ఈ మేరకు 2018లో దానపత్రం పేరుతో బాబాకు స్టాంప్‌ పేపర్‌ మీద రాసిచ్చాడు. బాబా, ఆయన శిష్యుడు సోపన్‌ ధక్నే, బాలిక తండ్రి, బాలిక నలుగురూ బద్నాపూర్‌లోని దేవాలయంలో ఉండేవారు. బాబా, ఆయన శిష్యుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సదరు బాలిక 2021 ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారిద్దరినీ అరెస్టు చేశారు. బెయిలు కోసం నిందితులు కోర్టును ఆశ్రయించారు. బాలికను దేవుడి సాక్షిగా కన్యాదానం చేస్తున్నట్టు ఆమె తండ్రి రాసిచ్చాడని బాబా కోర్టులో వాదించాడు. దీనిపై స్పందించిన కోర్టు... బాలిక తాను మైనర్‌నని ఫిర్యాదులో పేర్కొందని, రక్షణగా ఉండాల్సిన తండ్రి బాబాకు దానం చేయడమేంటని ప్రశ్నించింది. బాలికను దానం చేయడం చాలా కలచివేసే విషయమని పేర్కొంది. జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఈ అంశాన్ని త్వరగా విచారించి బాలికకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. నిందితులిద్దరికీ బెయిలు మంజూరు చేస్తూ విచారణను ఫిబ్రవరి 4కి వాయిదావేసింది.

Updated Date - 2022-01-29T17:23:36+05:30 IST