అధికారులు కావలెను!

ABN , First Publish Date - 2020-09-25T06:06:09+05:30 IST

జిల్లాలో పాలన గాడి తప్పింది. జిల్లా అధికార యంత్రాంగానికి బాస్‌ అయిన కలెక్టర్‌ సహా పలు కీలక శాఖలకు ఇన్‌చార్జీలే

అధికారులు కావలెను!

మెదక్‌ జిల్లాకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సహా కీలక అధికారులు కరువు

పలు శాఖలకు అధిపతులే లేరు

ఇన్‌చార్జిలతో పడకేసిన పాలన

భర్తీపై చొరవ చూపని పాలకులు

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, సెప్టెంబరు 24 : జిల్లాలో పాలన గాడి తప్పింది. జిల్లా అధికార యంత్రాంగానికి బాస్‌ అయిన కలెక్టర్‌ సహా పలు కీలక శాఖలకు ఇన్‌చార్జీలే దిక్కయ్యారు. కొన్ని శాఖలు ఏళ్ల తరబడి ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్న దుస్థితి నెలకొన్నది. పర్యవేక్షణ, అజమాయిషీ చేస్తూ సంబంధిత విభాగాన్ని ముందుకు నడపాల్సిన పోస్టులే ఖాళీలతో వెక్కిరిస్తుంటే.. ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం, జిల్లా ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం ఇబ్బందికరంగా మారింది. 


కలెక్టర్‌ సహా పలు శాఖలకు ఇన్‌చార్జిలే దిక్కు

మెదక్‌ జిల్లాను అధికారుల కొరత పీడిస్తోంది. జిల్లా ఆవిర్భావం జరిగి నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా.. నేటికీ బాలారిష్టాలు దాటడం లేదు. ముఖ్యంగా శాఖాధిపతుల పోస్టులు ఏళ్ల తరబడిగా ఖాళీగా ఉండడంతో పాలనకు ప్రధాన అవరోధంగా మారుతోంది. రెగ్యులర్‌ అధికారుల్లేక.. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఆశించిన మేర ఫలితాలు కానరావడం లేదు. జిల్లాలో అత్యంత కీలకమైన ఉన్నతాధికారి కలెక్టరే. జిల్లాస్థాయిలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, సర్కారు నుంచి వచ్చే ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడానికైనా.. ఆయన పాత్రే కీలకం. అంతటి ముఖ్యమైన పోస్టు దాదాపు రెండు నెలలుగా భర్తీకి నోచుకోవడంలేదు. ఈ ఏడాది జూలై 31న కలెక్టర్‌ ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగించారు.


ఆయన సీఎం జిల్లాకు కలెక్టర్‌గా ఉండటంతో పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. దాంతో వెంకట్రామారెడ్డి జిల్లా పాలనపై దృష్టి పెట్టే వీలు చిక్కడం లేదు. వారానికి ఒకట్రెండు సార్లు జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. అదే విధంగా కలెక్టర్‌ తర్వాత అత్యంత కీలకమైన అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) పోస్టు ఇటీవలే ఖాళీ అయింది. ఓ భూమికి సంబంధించిన ఎన్వోసీ విషయంలో భారీ లంచం డిమాండ్‌ చేసిన కేసులో ఈ నెల 9న అదనపు కలెక్టర్‌ నగేష్‌ సహా మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. దాంతో ఆయనతో పాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, చిల్‌పచెడ్‌ తహసీల్దార్‌ సత్తార్‌ను గత వారం ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అదనపు కలెక్టర్‌ బాధ్యతను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. 


వ్యవసాయ శాఖకు అధికారే లేరు

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఆ శాఖకు ఏళ్ల తరబడిగా అధిపతిని నియమించలేదు. పరశురాంనాయక్‌ ప్రస్తుతం ఇన్‌చార్జి డీఏవోగా కొనసాగుతున్నారు. నర్సాపూర్‌ ఆర్డీవోగా మెదక్‌ ఆర్డీవో సాయిరాం అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి హనూక్‌ను బుధవారం ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. గ్రామ పంచాయతీలకు సర్కారు కేటాయించే ఆర్థిక సంఘం నిధులను సకాలంలో ఖాతాల్లో జమచేయడంలో నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై ఆయనపై వేటు పడింది. దాంతో ఆ బాధ్యతను ఇంకా ఎవరికీ కేటాయించలేదు. డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణంతో పాటు పల్లె ప్రగతి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలంటే రెగ్యులర్‌ అధికారి అత్యంత అవసరం. కానీ ఎప్పటికి భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిగా ఉన్న అశోక్‌కుమార్‌గత నెలాఖరులో ఉద్యోగ విరమణ పొందారు.


ఇన్‌చార్జిగా ఏడీ వెంకటయ్యను కొనసాగిస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంటోంది. నిన్నమొన్నటివరకు అదనపు కలెక్టర్‌ నగే్‌షకు అదనపు బాధ్యతలు ఇవ్వగా ఆయన సస్పెన్షన్‌తో ఇన్‌చార్జి కూడా లేకుండా పోయారు. ధాన్యం కొనుగోలు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ శాఖకు అధికారి లేకపోవడం ఇబ్బందే. మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలకు జిల్లా అధికారుల్లేక ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా ఉన్న దేవయ్య అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ట్రెజరీ ఆఫీసర్‌గా జహీరాబాద్‌ ఏటీవో సాయిలును కొనసాగిస్తున్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంటోంది. గతవారం వరకు ఇన్‌చార్జిగా ఉన్న జీవీఎ్‌సగౌడ్‌ అనారోగ్యం కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో ఎవరికీ బాధ్యతలను అప్పగించలేదు. యువజన సర్వీసులు, క్రీడల శాఖకు జిల్లాస్థాయి అధికారి పోస్టు మంజూరు లేకపోవడంతో ఫిజికల్‌ డైరెక్టర్లతో నెట్టుకొస్తున్నారు. 


ఎన్నాళ్లకు భర్తీ చేస్తారో ?

మొత్తంగా జిల్లాలో పాలనకు అధికారుల కొరత ఏర్పడింది. నియామకాలకు చర్యలు చేపట్టడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపిన దాఖలాలు లేవు. పొరుగున ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే అధికారులు, సిబ్బందిని తక్కువ సంఖ్యలో మెదక్‌ జిల్లాకు కేటాయించారు. పలు కారణాలతో ఖాళీ అయిన స్థానాలను వెనువెంటనే భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కీలకమైన అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ, అజమాయిషీ కొరవడింది. అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, సమస్యలు ఉత్పన్నమైనపుడు జిల్లా స్థాయిలో పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వారు లేకపోవడంతో పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి అమలులో అత్యంత ముఖ్యమైన శాఖాధిపతుల పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించి రెగ్యులర్‌ అధికారులను నియమించాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు. 

Updated Date - 2020-09-25T06:06:09+05:30 IST