తప్పించండి

ABN , First Publish Date - 2021-10-12T06:56:55+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో పదిరోజుల క్రితం నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను సోమవారం న్యాయస్థానం మూడురోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది...

తప్పించండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో పదిరోజుల క్రితం నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను సోమవారం న్యాయస్థానం మూడురోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. సుప్రీంకోర్టు జోక్యం తరువాత మాత్రమే ఆశిష్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. జరిగిన హింసలో ‘కుట్ర’ కోణాన్ని నిర్థారించేందుకు ఆశిష్‌ కస్టడీ అవసరమని పోలీసులు అడిగినప్పుడు, ఆయనను వేధించరాదనీ, న్యాయవాది పక్కనే ఉంటారనీ కొన్ని నిబంధనలు పెట్టి న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మంత్రిగారి కుమారుడినుంచి ఏమి నిజాలు కక్కిస్తుందో చూడాలి.


విచారణకు ఆదేశించినందుకూ, ఆశిష్‌ను దారికితెచ్చినందుకు యూపీ పాలకుడు యోగిని అస్మదీయులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సుప్రీంకోర్టుతో పడచీవాట్లు తిన్నందుకు ఇసుమంతైనా అవమానం లేకపోగా, సత్వరమే స్పందించపోతే సర్వోన్నత న్యాయస్థానమే రంగంలోకి దిగుతుందన్న భయంతో ఈ మాత్రమైనా జరిగిందన్నది వాస్తవం. శుక్రవారం సిట్‌ జారీ చేసిన సమన్లను ఆశిష్‌ చెత్తబుట్టలో పడేశాడు. ఇప్పటికైనా ఎవరినైనా అరెస్టు చేస్తారా? అని అదేరోజు సుప్రీంకోర్టు గద్దించింది. నలుగురు రైతులను తొక్కిచంపేసి, మరో నలుగురి మరణానికి కారకులైన వారి విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగోలేదని ప్రధానన్యాయమూర్తి పెదవివిరిచారు. ఇంతటి భయానకమైన ఘటన దర్యాప్తు విషయంలో ఇప్పటివరకూ ఏం చేశారు, ఇకపై ఏం చేయదల్చుకున్నారో కనీసం చెప్పండి అని నిలదీసింది న్యాయస్థానం. నోటీసులు ఇచ్చాం, ప్రశ్నిస్తాం రమ్మన్నాం అంటూ యూపీ తరఫున న్యాయవాది హరీశ్‌ సాల్వే ఏదో చెబుతూంటే, అన్ని హత్యకేసుల్లోనూ నిందితులను ఇలాగే బతిమాలుకుంటారా? అని ప్రధాన న్యాయమూర్తి వేసిన ప్రశ్న యూపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. మిగతాకేసుల్లో మిగతావారితో వ్యవహరిస్తున్నట్టుగానే ఈయననూ చూడండి అని ప్రధాన న్యాయమూర్తి విస్పష్టంగా చెప్పిన తరువాతే అనంతర పరిణామాలన్నీ సంభవించాయనీ, మరో పదిరోజుల్లో పాలకులు న్యాయస్థానానికి జవాబు చెప్పుకోవాల్సి ఉన్నదనీ మరిచిపోకూడదు. 


కొత్తసాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు అక్కడకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వస్తున్నారని తెలిసి, నిరసన తెలియచేయాలని అనుకోవడం మంత్రిగారికీ, ఆయన కుమారుడికీ ధిక్కారంగా, అవమానంగా అనిపించింది. రైతులను శిక్షిస్తానని మంత్రి దీనికి కాస్తముందు జరిగిన ఓ సభలో హెచ్చరించారు కూడా. కానీ, నీ చట్టాలు మాకొద్దు అన్నందుకు శరీరాలు నుజ్జయిపోయేంతగా కారుతో తొక్కిచంపేయాలన్నంత కసి ఏమిటో అర్థంకాదు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ అమానవీయమైనదాడిలో కుమార రత్నం ప్రత్యక్షపాత్ర ఉన్నదా లేదా అన్నది తేలాలంటే విచారణ జరగాలి, నిందితులను అరెస్టు చేయాలి. కానీ, అందుకు భిన్నంగా సిక్కు రైతులను ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో పోల్చుతూ ఎదురుదాడిచేయడం, కట్టుకథలు సృష్టించడం, విపక్షనేతలను నిర్బంధించడం, మీడియా గొంతునొక్కడం వంటి విన్యాసాలమీదే పాలకులు దృష్టిపెట్టారు. సుప్రీకోర్టుజోక్యం చేసుకొని గట్టిగా చరిస్తే కానీ కదల్లేదు కనుకనే, పలువురు న్యాయకోవిదులు రాజ్యాంగ రక్షకుడని జస్టిస్‌ ఎన్‌వి రమణను ప్రశంసించారు.


ఇంతటిఘోరమైన ఘటన జరిగినా కూడా కేంద్రహోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రాను పదవినుంచి తొలగించలేదు. ఆయన గతచరిత్ర ఎంతటి ఘనమైనదో అందరికీ తెలుసు. లఖింపూర్‌ ఘటనమీద ప్రధాని నోరువిప్పకపోవడం మరీ విచిత్రం. పైగా ఏమీ జరగనట్టుగా ఆయన ఆ వెంటనే లక్నోలో ఓ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ను కీర్తించి మరీ ఢిల్లీ వచ్చారు. విమర్శలను సైతం మోదీ సంతోషంగా స్వీకరిస్తారని అమిత్‌షా ప్రశంసించారు కానీ, లఖింపూర్‌ ఘటన మీద వ్యాఖ్యానించినందుకు వరుణ్‌, మేనకాగాంధీలు బీజేపీ జాతీయకార్యవర్గం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గతంలో రైతు ఆందోళనలను వెనకేసుకొచ్చిన నాయకులకు ఏ గతిపట్టిందో అందరికీ తెలుసు. అజయ్‌మిశ్రాను తక్షణం పదవినుంచి తొలగించాలన్న డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా వరుస నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రియాంక నాయకత్వంలో కాంగ్రెస్‌ నిరసనలు, దీక్షలు చేస్తున్నది. అన్నింటికీ మించి లఖింపూర్‌ దారుణం బీజేపీ పరువు నిలువునా తీసింది. మరింత అప్రదిష్టపాలుగాకుండా కాపాడుకోవాలంటే హోంశాఖ సహాయ మంత్రిని వెంటనే తప్పించడం అవసరం.

Updated Date - 2021-10-12T06:56:55+05:30 IST