Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలలో బాలకాండ అఖండ పారాయణం

తిరుమల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఉదయం బాలకాండ అఖండ పారాయణం నిర్వహించారు. దీంతో తిరుమల సప్తగిరులు మార్మోగాయి. బాలకాండలోని 14 నుంచి 17వ సర్గ వరకున్న 157 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకుడు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన దివ్యశక్తి మంత్రోచ్ఛరణ అని, దీనితో సమస్త రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. కొన్ని వందల ఏళ్లుగా మానవులు రామాయణం విన్నా, పారాయణం చేయడం వల్ల బాధలు తొలగి, సుఖ సంతోషాలతో ఉన్నట్లు పురాణాల ద్వారా నిరూపితమైందన్నారు. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించినట్లు, యావత్‌ ప్రపంచం రామనామం పలికితే సకల శుభాలు సిద్ధిస్తాయన్నారు. ప్రపంచ శాంతి, కరోనా మూడో వేవ్‌ నుంచి పిల్లలు, పెద్దలు సుఖశాంతులతో ఉండాలని బాలకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలకాండలోని శ్లోకాలను, విషూచికా మహమ్మారి నివారణ మంత్రమును ఎస్వీబీసీ ప్రత్యక్షప్రసారం ద్వారా కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందన్నారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేదపాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత వర్సిటీకి చెందిన శాస్త్రీయ పండితులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement