వైద్యో నారాయణో హరి అనే మాటను మా వైద్యులు నిజం చేశారు : బాలయ్య

ABN , First Publish Date - 2020-10-20T23:23:58+05:30 IST

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగికి శస్త్ర చికిత్స చేసి భారీ కణితిని వైద్యులు తొలగించారు. ..

వైద్యో నారాయణో హరి అనే మాటను మా వైద్యులు నిజం చేశారు : బాలయ్య

హైదరాబాద్ : బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగికి శస్త్ర చికిత్స చేసి భారీ కణితిని వైద్యులు తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన యువతి రొమ్ము క్యాన్సర్‌తో బసవతారకం ఆస్పత్రికి రాగా ఆమెకు శస్త్ర చికిత్సచేసిన వైద్యులు భారీ కణితిని తొలగించారు. ఈ ఆపరేషన్‌ను ఉచితంగానే నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిన అనంతరం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆ యువతిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియా మీట్ నిర్వహించి ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘వైద్యో నారాయణో హరి’ అనే మాటను బసవతారకం వైద్యులు నిజం చేశారని తెలిపారు.


బాలయ్య మాటల్లోనే..

శ్రీకాళహస్తికి చెందిన యువతి రొమ్ముకు కుడివైపున భారీ కణితితో బసవతారకంకు వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలని మా డాక్టర్లు చెప్పారు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ యువతి ఆరోగ్యం క్షిణిస్తుందని వైద్యులు చెప్పారు. ఆ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని చెప్పాను. నాన్న గారి ఆశయం మేరకు బసవతారకంలో ఆ యువతికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించాం. రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అయినప్పటికి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సర్జరీ పూర్తి చేశారు. ఆపరేషన్‌కు రెడీ చేశాక ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మూడు వారాలు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచాము. ఆ మూడు వారాలు కాలంలో ఆ కణితి బాగా కుళ్ళిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ కేసును డాక్టర్లు ఎంతో ఛాలెంజింగ్ తీసుకుని కరోనాను కూడా లెక్కచేయకుండా ఆపరేషన్ నిర్వహించారు. కోవిడ్ వచ్చిన వారికి కూడా బసవతారకంలో వైద్యం చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బసవతారకంను తీర్చిదిద్దుతున్నాముఅని బాలయ్య వెల్లడించారు.

Updated Date - 2020-10-20T23:23:58+05:30 IST