ఆన్‌లైన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-19T05:37:16+05:30 IST

ఇంటర్‌ అడ్మిషన్లలో తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటి నుంచే కళాశాల ను ఎంపిక చేసుకునే అవకాశమిచ్చారు. పారదర్శకత కోసం తొలిసారిగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23 వరకూ దరఖాస్తుకు గడువు ఇచ్చారు. కానీ సిగ్నల్‌, సర్వర్‌ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌ టెన్షన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇచ్ఛాపురం కాలేజీకి వచ్చిన విద్యార్థులు


ఇంటర్‌ దరఖాస్తుకు అడ్డంకులు

సక్రమంగా పనిచేయని మొబైల్‌ యాప్‌

అసౌకర్యానికి గురవుతున్న విద్యార్థులు

పాత పద్ధతిలో కళాశాలలను ఆశ్రయిస్తున్న వైనం

(ఇచ్ఛాపురం)

ఇంటర్‌ అడ్మిషన్లలో తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటి నుంచే కళాశాల ను ఎంపిక చేసుకునే అవకాశమిచ్చారు. పారదర్శకత కోసం తొలిసారిగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23 వరకూ దరఖాస్తుకు గడువు ఇచ్చారు. కానీ సిగ్నల్‌, సర్వర్‌ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొబైల్‌ యాప్‌ సరిగ్గా పని చేయకపోవడంతో నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు విద్యార్థులు నేరుగా కళాశాలలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద 167 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 46 ప్రభుత్వ, 109 ప్రైవేటు కళాశాలు ఉన్నాయి. సంక్షేమ శాఖల నిర్వహణలో మరో 12 కాలేజీలు కొనసాగుతున్నాయి. కళాశాల సామర్థ్యాన్ని బట్టి 4 నుంచి 5 సెక్షన్లు వరకూ ఉంటాయి. గత ఏడాది ప్రభుత్వం సెక్షన్‌కు 80 మందికి అనుమతిచ్చింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే తొలిసారిగా ఆన్‌లైన్‌ ప్రక్రియతో పాటు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, బీసీలకు 25 శాతం, మైనార్టీలకు 5 శాతం, క్రీడాకోటా కింద 5 శాతం, ఈబీసీ కోటా కింద 10 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర విద్యార్ధులకు లభిస్తాయి. అంతా బాగుంది కానీ...ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చాలా మంది పాత పద్ధతిలోనే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. 

  ఫీజులపై స్పష్టత కరువు

ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు కాలేజీల దోపిడీని అరికడతామని గతంలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీలు రంగప్రవేశం చేశాయి. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ఒత్తిడి చేస్తున్నాయి. విద్యాబోధన, వసతులు వంటి వాటిని సాకుగా చూపి ఆకర్షితులను చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రద్దు నాటి నుంచే కొన్ని కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం సిబ్బందిని నియమించుకున్నాయి. ఫీజుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీలకు కలిసి వస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థుల నుంచి అడ్వాన్స్‌ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో విధిగా తమ కాలేజీనే ఎంపిక చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా ఫీజులు, ఇతరత్రా విషయాల్లో ముందుగానే మార్గదర్శకాలు విడుదల చేసి ఉంటే ఇబ్బందులు ఉండేవి కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజులపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


సమస్యలు అధిగమిస్తాం

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వాస్తవమే. మార్పులు చేర్పులతో మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పారదర్శకత కోసమే ప్రభుత్వం ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. తొలిసారిగా రిజర్వేషన్లు సైతం అమలు చేస్తున్నాం. 

-కె.సూర్యప్రకాశరావు, డీవీఈవో, శ్రీకాకుళం





Updated Date - 2021-08-19T05:37:16+05:30 IST