విశాఖ జిల్లాలో ఐదుగురికి బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు

ABN , First Publish Date - 2020-10-19T10:44:58+05:30 IST

జిల్లాలో ఐదుగురికి బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. వైసీపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యకార, గవర, నగరాలు, యాత, నాగవంశం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను విశాఖ జిల్లాకు కేటాయించింది.

విశాఖ జిల్లాలో ఐదుగురికి బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు

ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు

మత్స్యకార కార్పొరేషన్‌కు కోలా గురువులు 

గవర... బొడ్డేడ ప్రసాద్‌, నగరాలు.... పిళ్లా సుజాత

యాత.... పిల్లి సుజాత, నాగవంశం.... బొడ్డు అప్పలకొండమ్మ


విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదుగురికి బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. వైసీపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యకార, గవర, నగరాలు, యాత, నాగవంశం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను విశాఖ జిల్లాకు కేటాయించింది. మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా దక్షిణ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు కోలా గురువులు నియమితులయ్యారు. ఈయన 2009 ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత కొంతకాలానికి వైసీపీలో చేరారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో టికెట్‌ ఆశించినప్పటికీ, అధిష్ఠానం చివరి నిమిషంలో పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయినప్పటికీ గురువులు నిరాశ చెందకుండా పార్టీలోనే కొనసాగుతున్నారు. సుమారు 16 నెలల తరువాత అధిష్ఠానం కరుణించి నామినేటెడ్‌ పదవిని కట్టబెట్టింది. 


ఎలమంచిలి నియోకజవర్గంలో బలమైన నేతగా నాయకుడిగా గుర్తింపు పొందిన బొడ్డేడ ప్రసాద్‌ను గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా  నియమించింది. మాజీ మంత్రి కొణతాల శిష్యుడైన ఆయన కాంగ్రెస్‌ హయాంలో ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలం తరువాత తిరిగి సొంతగూటికి చేరారు.


యాత కార్పొరేషన్‌ చైర్మన్‌గా పిల్లి సుజాత నియమితులయ్యారు. ఆర్డీవోగా పని చేసి 2010లో పదవీ విరమణ చేసిన ఆమె భర్త పిల్లి నూకరాజు 2012లో వైసీపీలో చేరారు. ముందు నుంచీ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన భార్య సుజాతకు చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. 


నగరాలు కార్పొరేషన్‌ చైర్మన్‌గా మధురవాడ ప్రాంతానికి చెందిన పిళ్లా సుజాతను నియమితులయ్యారు. ఈమె భర్త పిళ్లా సత్యనారాయణ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. వార్డుల పునర్విభజన జరగక ముందు నాలుగో వార్డు వైసీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 


నాగవంశం కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొడ్డు అప్పలకొండమ్మ నియమితులయ్యారు. భీమిలి నియోజకవర్గం మద్ది గ్రామానికి చెందిన ఈమె భర్త అప్పలనాయుడు చాలా కాలం క్రితం విజయవాడకు వలసపోయారు. అక్కడే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో విజయవాడ నగరంలో కార్పొరేటర్‌గా పని చేశారు. 

Updated Date - 2020-10-19T10:44:58+05:30 IST