అన్యాయానికి గురవుతున్న బీసీలు

ABN , First Publish Date - 2022-01-28T06:15:57+05:30 IST

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంలో బీసీ జపం చేస్తూ ఆనక తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీ ప్రజాప్రతినిధులు పలువురు తెలిపారు.

అన్యాయానికి గురవుతున్న బీసీలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీలు మురుగుడు, జంగా, పోతుల సునీత తదితరులు

జేఏసీ సమావేశంలో పలువురు ఆవేదన

మంగళగిరి, జనవరి 27: ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంలో బీసీ జపం చేస్తూ ఆనక తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీ ప్రజాప్రతినిధులు పలువురు తెలిపారు.  బీసీ సంక్షేమ కమిటీ ఎన్నారై అమెరికా విభాగ అధ్యక్షుడిగా చిల్లపల్లి నాగతిరుమలరావు గురువారం మంగళగిరి సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి నాగమోహనరావులను  బీసీ వెల్ఫేర్‌ జేఏసీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లను కేటాయించేలా అన్ని రాజకీయపార్టీలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం సాధించే విషయంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. 

బాపట్ల జిల్లాకు ప్రగడకోటయ్య పేరు పెట్టాలి: పోతుల సునీత

సరికొత్తగా ఏర్పాటవుతున్న బాపట్ల జిల్లాకు భావపురి జిల్లాకు బదులుగా చేనేత ముద్దుబిడ్డ ప్రగడ కోటయ్య పేర నామకరణం చేయాలని పోతుల సునీత డిమాండ్‌ చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజలందరి మదిలో ఉన్న విషయాన్ని తాను చెబుతున్నానన్నారు. ఈ అంశాన్ని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ... బీసీ నాయకుల పేర్లను పెట్టాలని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రగడ కోటయ్య చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ ప్రాంతానికి ఎన్నో సేవలను అందించారన్నారు.  

పొరుగురాష్ట్రమే బాగా ప్రోత్సహిస్తుంది: ఆనందయ్య

కరోనాకు మందు తయారీ, పంపిణీ విషయంలో తమిళనాడుతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాలు తనకు ఆహ్వానం పలికి ప్రోత్సహిస్తున్నాయని కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న ఆనందయ్య చెప్పారు. అదే సమయంలో మన రాష్ట్రం తనకు అనేక రకాలుగా ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియెంట్‌లు వచ్చినా తనవద్ద వున్న ఔషధ మూలికలతో నయం చేయవచ్చునన్నారు. ప్రజలకు అవసరమైన వైద్యసేవలను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్‌ శాఖనుంచి నోటీసులను పంపిస్తూ తనను ఇబ్బందుల పాల్జేస్తుందని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల అదిశేషు,  మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు తులిమెల్లి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, జనసేన రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T06:15:57+05:30 IST