ఇలాంటి ఆన్‌లైన్‌ ఆఫర్ల ప్రకటనలపై తస్మాత్ జాగ్రత్త

ABN , First Publish Date - 2021-05-09T16:45:23+05:30 IST

ఓ రోజు ఉదయం సునీతకు ఓ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ...

ఇలాంటి ఆన్‌లైన్‌ ఆఫర్ల ప్రకటనలపై తస్మాత్ జాగ్రత్త

హైదరాబాద్/కొత్తపేట : ఓ రోజు ఉదయం సునీతకు ఓ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కానుకలు అందజేస్తోందని మెసేజీ వచ్చింది. తెగ సంబర పడిపోయి ఆ మెసేజీని స్నేహితులందరికీ ఫార్వర్డ్‌ చేసింది. సైబర్‌ నేరాలపై అవగాహన ఉన్న ఓ స్నేహితురాలు సదరు మెసేజీ నకిలీదని తేల్చేసింది. ఇలా అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలను మోసం చేసేందుకు ఆకర్షణీయ ప్రకటనలు తయారుచేసి ఉచిత ఆఫర్లు, కానుకలు అంటూ సైబర్‌ మోసగాళ్లు మెసేజీలు, లింకులు పంపుతున్నారు. వాళ్లు పంపే లింకులపై క్లిక్‌ చేస్తే సైబర్‌ మాయగాళ్ల చేతిలో మోసపోవడం ఖాయమంటున్నారు సైబర్‌ నిపుణులు. అలాంటి సోషల్‌ మీడియా/ఆన్‌లైన్‌ ఆఫర్ల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని నగరంలోని సీ-డాక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ఏఎస్‌.మూర్తి, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సూచిస్తున్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబర్‌ నేరస్థులు పంపే ప్రకటనలపై వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


సూచనలు పాటించండి

పెద్ద కంపెనీల పేరుతో ఉచిత కానుకల ప్రకటనలు ఇస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఆ కంపెనీల నిజమైన వెబ్‌సైట్లను పరిశీలించాలి, నిజాలు వెల్లడవుతాయి. కంపెనీ వెబ్‌సైట్‌ల ప్రామాణికతను తెలుసుకోవాలి. వాస్తవాలను గుర్తించాలి. పర్వదినాలు, దినోత్సవాల సందర్భంగా ఉచితంగా కానుకలు ఇస్తామని సైబర్‌ నేరస్తులు పంపే లింక్స్‌ మోసపూరితాలని తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌నేరాల నివారణకు నిపుణుల సూచనలతో వెబ్‌సైట్‌లో పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సైబర్‌ నేరాలపై ఎల్‌బీనగర్‌ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు, లేదా వాట్సప్‌ నెం.9490617111 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. - మహేష్‌ భవత్‌, సీపీ, రాచకొండ కమిషనరేట్‌


ఉచిత కానుకల మెసేజీలు నమ్మవద్దు

అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేళ సోషల్‌ మీడియాలో ఉచిత కానుకలు ఇస్తామంటూ మెసేజీలు ఉప్పెనలా వస్తుంటాయి. అపరిచితులు పంపే మెసేజీలన్నింటిపైనా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. వెబ్‌సైట్లు, లింకులు, మెయిల్స్‌ను నిజమైనవా కాదా అని సరిచూసుకోవాలి. ఆన్‌లైన్‌లో అపరిచితులతో బ్యాంకు ఖాతాల, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం షేర్‌ చేయవద్దు. అలా సేకరించిన డేటాతో సైబర్‌ నేరస్తులు మోసాలు చేస్తారు. సీ-డాక్‌ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన నిరంతరం కొనసాగుతోంది. మరిన్ని వివరాలను www.InfoSecawareness.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. - సీహెచ్‌ఏఎస్‌.మూర్తి, అసోసియేట్‌ డైరెక్టర్‌ సీ డాక్‌.

Updated Date - 2021-05-09T16:45:23+05:30 IST