Abn logo
Sep 16 2020 @ 01:29AM

దేనికైనా సిద్ధం

సరిహద్దులు, సార్వభౌమత్వం కాపాడతాం

సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంది

ప్రస్తుత సరిహద్దులను చైనా గుర్తించట్లేదు

ఎల్‌ఏసీ యథాతథస్థితి మార్పు సమ్మతించం

ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోంది

చొచ్చుకొచ్చిన దళాలను తిప్పికొట్టాం

గల్వాన్‌ లోయలో చైనాకు భారీ ప్రాణనష్టం

లద్దాఖ్‌లో 38వేల చ.కి.మీ దురాక్రమణ

ఇప్పటికీ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తమే

చైనాకు భారత్‌ ఘాటు హెచ్చరిక

లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చైనాకు భారత్‌ సూటిగా స్పష్టం చేసింది. ‘‘లద్దాఖ్‌లో పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. అయితే మన సైనిక దళాలు పూర్తిగా అప్రమత్తంగా, దృఢంగా ఉన్నాయి. సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి పూర్తిగా సంసిద్ధమయ్యాయి.


మేం శాంతియుతంగా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి, చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో... పరిస్థితి ఎదురు తిరిగితే మన భూభాగాన్ని రక్షించుకోవడానికి సిద్ధం. ఈ విషయంలో సందేహం ఏమాత్రం అవసరం లేదు. గట్టి సంకల్పంతో ఉన్నాం’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డ్రాగన్‌ను హెచ్చరించారు. లద్దాఖ్‌ ఘర్షణలు,పరిస్థితిపై మంగళవారం ఆయన లోక్‌సభలో ప్రకటన చేశారు.


మే నెలలో ఘర్షణలు మొదలయ్యాక ప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా ఓ ప్రకటన చేయడం ఇదే ప్రథమం. సహజంగా ఆచితూచి మాట్లాడే రాజ్‌నాథ్‌... కాస్త ఘాటుగానే మాట్లాడారు. గతంలో చైనాతో ఎన్నోమార్లు సరిహద్దు ప్రతిష్ఠంభన ఎదురైనా ఇది చాలా తీవ్రమైనదన్నారు.   


‘‘లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఇప్పటికే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. 1963లో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌లోని 5180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఽచైనాకు పాకిస్థాన్‌ ధారాదత్తం చేసేసింది. ఇవికాక తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో మరో 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది.


గత ఒప్పందాల ప్రకారం కుదరిన సరిహద్దుల్ని చైనా గుర్తించడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిని ఏకపక్షంగా మార్చేయాలని చూస్తోంది. ఇది మాకు సమ్మతం కాదని చైనాకు స్పష్టం చేశాం’’  అని రాజ్‌నాథ్‌ వివరించారు.


‘‘ఏప్రిల్‌ నుంచి తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా భారీగా సేనలను, సాయుధ శకటాలను మోహరించింది. మేలో భారత గస్తీ దళాలను అడ్డుకోవడం మొదలుపెట్టింది. ఎల్‌ఏసీ వద్ద ఘర్షణ అనంతరం జూన్‌ 6న ఇరుదేశాల కమాండర్లు సమావేశమై.. ఎల్‌ఏసీని గౌరవించాలని, దళాలు వెనక్కి మళ్లాలని ఒప్పందానికి వచ్చారు. కానీ, దీన్ని తుంగలో తొక్కి జూన్‌ 15న చైనా దళాలు గల్వాన్‌ లోయలో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. మన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి వారిని నిలువరించారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాకు భారీగానే ప్రాణనష్టం మిగిల్చారు’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్‌ పలుమార్లు ప్రయత్నించిందని, కానీ.. చైనా కొత్త కొత్త ఏరియాల వద్ద ఘర్షణలకు కాలుదువ్వుతూ వచ్చిందని తెలిపారు. ఆగస్టు 29, 30వ తేదీల్లో ఎల్‌ఏసీ వద్ద చొచ్చుకు రావడానికి యత్నించగా మన సైన్యం దీటుగా అడ్డుకుందన్నారు. ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, భద్రతాపరంగా సున్నితమైన అంశమైనందున ఇంతకంటే వివరాలు చెప్పలేమని అన్నారు. 


జోహార్‌.. సంతోష్‌!

రాజ్‌నాథ్‌ తన ప్రసంగంలో చైనాతో ఘర్షణల్లో ప్రాణాలు వదిలిన తెలంగాణ వీరతేజం కల్నల్‌ బిక్కుమళ్ల సంతో్‌షబాబు త్యాగనిరతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి సంతోశ్‌, ఇతరులు అత్యున్నత త్యాగనిరతి ప్రదర్శించారు. వారి ధైర్య సాహసాలు, తెగువ శ్లాఘనీయం. వారందరికీ సభ ఘనంగా నివాళులర్పిస్తోంది’’ అని కొనియాడారు. దేశమంతా ఆర్మీ వెంటే ఉందన్న తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. 


కాంగ్రెస్‌ వాకౌట్‌

రాజ్‌నాథ్‌ ప్రసంగం ముగిశాక చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. కానీ, సున్నితమైన సమస్యపై చర్చకు తావులేదంటూ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

‘మరోవైపు మోదీజీ! చైనా పేరును ప్రస్తావించడానికి ఎందుకు భయపడుతున్నార’ంటూ రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మాట్లాడడానికి జంకుతున్నారని కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. 


Advertisement
Advertisement
Advertisement