కూలీలకు అందని కూలి

ABN , First Publish Date - 2021-06-14T04:57:34+05:30 IST

రెక్కడితే గాని డొక్కాడని ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని కొంతమంది కూలీలకు 40 రోజులుగా డబ్బులు అందడంలేదు. గతంలో మూడు వారాలలోపే డబ్బులు చేతికి అందేవి. ఈసారి కూలి డబ్బులు కులాల వారీగా

కూలీలకు అందని కూలి

కులాల వారీగా చెల్లింపులతో అయోమయం
40 రోజులుగా అందని కూలి డబ్బులు
ఆందోళనలో ఉపాధి హామీ కూలీలు

ఆర్మూర్‌, జూన్‌ 13: రెక్కడితే గాని డొక్కాడని ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని కొంతమంది కూలీలకు 40 రోజులుగా డబ్బులు అందడంలేదు. గతంలో మూడు వారాలలోపే డబ్బులు చేతికి అందేవి. ఈసారి కూలి డబ్బులు కులాల వారీగా చెల్లిస్తుం డడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కూలీలను కులాల వారీగా వర్గీకరించారు. ఒక కులం వారికి ఒకసారి, మరో కులం వారికి ఇంకో సారి విడుదల చేస్తున్నారు. ఎస్టీలకు గత 40 రోజులుగా డబ్బులు రావడం లేదు. గత నెల 4వ తేదీ నుంచి డబ్బులు రావల్సి ఉంది. అయితే, రెండు రోజుల క్రితం రెండు వారాల డబ్బులు విడుదల చేశారు. ఇవి అన్ని కులాల వారీకి విడుదల చేయలేదు. దీంతో డబ్బులు అందని కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కులాల వారికి విడుదల చేస్తే బాగుండే దని అభిప్రాయపడుతున్నారు. గతంలో అన్ని కులాల వారీకి ఒకేసారి డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం కూలీలను కులాల వారీగా విభజించారు. ప్రస్తుత కరోనా కాలంలో ఉపాధి హామీ పథకం ఒక వరంలా తయారైంది. ఎక్కడ ఉపాధి దొరకకున్నా.. ఈ పథకం ద్వారా ఉపాధి దొరికింది. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో ఇతర ఉపాధి అవకాశాలు లభించలేదు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ ప్రకటనలో తెల్లరేషన్‌ కార్డుదారులకు నెలకు రూ.1500 చొప్పున మూడు నెలలు చెల్లించారు. బియ్యం కూడా పంపిణీ చేశారు. ఈయేడు నెలకు 15కిలోల చొప్పున రెండు నెలలు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆపద సమయంలో ఇలాంటి సహాయం చేస్తున్నప్పటికీ.. చేసిన పనికి కూలి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. డబ్బులు రానందున తాము సరుకులు ఎలా కొనుగోలు చేసుకోవాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఆపద సమయంలో మరింత సహాయం చేయాల్సిందిపోయి.. సమయానికి కూలి డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమంటున్నారు.
కష్ట కాలంలో ఆదుకున్న ఉపాధి పథకం
కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పట్టణాల్లో ఉన్న వారు స్వస్థలాలకు చేరుకున్నారు. వేసవిలో వరికొతల తర్వాత వ్యవసాయ పనులు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఉపాధి  కూలీకి వెళ్లారు. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో ఉపాధి కూలీల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆర్మూర్‌ మండలం లో ఒక రోజు గరిష్ఠంగా రికార్డుస్థాయిలో మొత్తం 6,700 మంది కూలీకి వచ్చారు. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ సమయంలో సుమారు 15రోజులు కూలీల సంఖ్య తక్కువగా ఉంది. ఆ తర్వాత క్రమంగా కూలీల సంఖ్య పెరిగింది. కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో ఎప్పటి మాదిరి కూలీలు వచ్చారు. కూలీలకు రెగ్యులర్‌గా డబ్బులు చెల్లిస్తే అపాద సమయంలో ఆదుకున్నట్లయ్యేది. కానీ డబ్బులు చెల్లించకపోవడంతో తమ మీద ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
 జిల్లాలో 5లక్షల 72వేల 232మంది కూలీలు
జిల్లాలో మొత్తం రెండు లక్షల 80వేల 42 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఐదు లక్షల 72 వేల 232 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఎస్సీలు 59 వేల 257 మంది, ఎస్టీలు 32వేల 72మంది, బీసీలు లక్షా 52వేల 142 మంది, ఓసీలు 36వేల 571మంది కూలీలు ఉన్నారు. ఎస్సీ, బీసీలకు మే 27వ తేదీ వరకు డబ్బులు చెల్లించగా, ఎస్టీలకు మే 4వ తేదీ నుంచి డబ్బులు రావడం లేదు. తమకు వెంటనే డబ్బులు చెల్లించాలని పలువురు కూలీలు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-14T04:57:34+05:30 IST