ఓ అమ్మ విలాపం!

ABN , First Publish Date - 2021-06-02T16:26:19+05:30 IST

జబ్బు చేసిన బిడ్డను బతికించుకోవాలని..

ఓ అమ్మ విలాపం!

జబ్బు చేసిన బిడ్డకు కారుణ్య మరణం కోసం కోర్టుకెళ్లిన తల్లి

కోర్టుకు సెలవని తెలిసి తిరిగి వెళుతుండగా మార్గమధ్యంలోనే బిడ్డ మృతి

బిడ్డ అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో పక్షం కిందట ఇల్లు విడిచిన తండ్రి

బీర్జేపల్లె‌లో విషాదం


చౌడేపల్లె(చిత్తూరు): జబ్బు చేసిన బిడ్డను బతికించుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు పడని తపన లేదు.. ఆస్పత్రులకు తిరిగి రూ. లక్షలు ఖర్చు చేసినా నయమైనట్టే కనిపించిన మాయదారి జబ్బు మళ్లీ తిరగదోడింది.. అప్పటిదాకా చికిత్స చేసిన వైద్యులు కూడా చేతులెత్తేశారు.. పెద్దాస్పత్రిలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదని దానికి రూ. లక్షలు ఖర్చవుతాయని తేల్చి చెప్పేశారు.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ఆరోగ్యశ్రీ వంటి పథకాలూ ఆదుకోలేదు.. అప్పటికే నాలుగైదు లక్షలు దాకా అప్పులపాలైన తండ్రికి ఏకంగా మతే చలించింది. దీంతో ఇంట్లో నుంచీ ఎటో వెళ్లిపోయాడు. దారీతెన్నూ తోచని పేద తల్లి అపస్మారక స్థితిలో ఉన్న పదేళ్ల బిడ్డతో కోర్టు మెట్లు ఎక్కింది.. బతికించుకునే శక్తి లేనందున బిడ్డను చంపుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ వేడుకుందామని వెళ్తే సెలవుల కారణంగా కోర్టు మూతపడింది.. నిస్సహాయంగా ఇంటికి వెనుదిరిగి వెళుతుండగా మార్గమధ్యంలోనే బిడ్డ తల్లి వడిలోనే కన్నుమూశాడు.. బిడ్డను చంపిన పాపం నీకెందుకు అన్నట్టుగా తల్లిని అపనిందల నుంచీ రక్షించాడు.. చౌడేపల్లె మండలంలో మంగళవారం ఈ విషాదకర ఘటన జరిగింది.


చారాల పంచాయతీ బీర్జేపల్లెలో ఉన్నదంతా వడ్డెర కుటుంబాలే. అంతా నిరుపేదలు. ఊరి పక్కనే వున్న బండపై రాళ్లు కొట్టుకుని గుల్ల అమ్ముకోవడమే బతుకుదెరువు. ఆ కుటుంబాల్లో ఒకటైన మణి, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి పదేళ్లు కాగా చిన్నవాడికి పదినెలలు. పెద్ద కొడుకు హర్షవర్ధన్ నాలుగేళ్ల కిందట ఇంటి మిద్దెపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. ప్రమాదంలో తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. నోరు, ముక్కులతో పాటు మలమూత్రాల్లో కూడా రక్తస్రావం అవుతుండడంతో తిరుపతి రుయా ఆస్పత్రిలోనూ, వేలూరు సీఎంసీ వైద్యశాలలోనూ చికిత్స చేయించారు. వైద్యం కోసం రూ. లక్షలకు పైగా అప్పులైనా బిడ్డ కోలుకున్నాడు అదే చాలని ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోనే ఉన్న స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. అంతా బాగుందనుకునేలోపే నెల కిందట పిల్లవాడికి అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. నోటి వెంట, ముక్కు వెంట రక్తస్రావం మొదలైంది. తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్తే ఇక్కడ చేయగలిగింది లేదని, ఏదైనా పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తే ఉపయోగం వుంటుందని వైద్యులు సూచించారు.


దానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. గతంలో ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనుభవాలు, లక్షల్లో అయిన అప్పులు కళ్లముందు పదేపదే మెదలాడుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిపడిన సమస్యతో తండ్రి మణి మతి స్థిమితం కోల్పోయాడు. పదిహేను రోజుల కిందట ఇంటి నుంచీ ఎటో వెళ్లిపోయాడు. ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు భర్త మతి చలించి ఇల్లు వదిలిపెట్టడంతో అరుణ కృంగిపోయింది. నిస్సహాయ స్థితిలో తన బిడ్డను చంపుకునేందుకు కారుణ్య మరణం పేరిట అనుమతి ఇవ్వాలని కోర్టును వేడుకునేందుకు మంగళవారం అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తీసుకుని పుంగనూరు వెళ్లింది. తీరా కోర్టుకు వెళ్లాక సెలవులని సిబ్బంది చెప్పడంతో నిరాశానిస్పృహలతో స్వగ్రామానికి వెనుదిరిగింది. ఇంటికి చేరకనే మార్గమధ్యంలో తల్లి వడిలోనే హర్షవర్ధన్ కన్నుమూశాడు. దీంతో బీర్జేపల్లె‌లో తీవ్ర విషాదం నెలకొంది. కఠినమైన రాతి బండలను కూడా బద్దలు కొట్టగలిగిన అరుణ కుటుంబ పేదరికం ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను మాత్రం కదిలించలేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.



Updated Date - 2021-06-02T16:26:19+05:30 IST