నమ్మించి మోసం
ABN , First Publish Date - 2021-03-17T06:05:15+05:30 IST
ఏళ్ల తరబడి జిల్లావాసులకు సేవలందించిన..
అమూల్ రాకతో అందరూ ఔట్
బెనిఫిట్లు ఇవ్వకుండానే బయటకు
దొడ్డిదారిన నెలముందే తొలగింపు
అమూల్ సేవలకు దూరందూరం
అన్యాయంపై 50రోజులుగా ఆందోళన
తొమ్మిది నెలలుగా లేని జీతభత్యాలు
అగమ్యగోచరంగా కుటుంబపోషణ
ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకోలు
ఒంగోలు: నమ్మకద్రోహం అంటే ఇదేనేమో. ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. అలాంటిది ప్రభుత్వం ఇచ్చిన హామీని వారంతా నమ్మారు. ఏళ్ల తరబడి ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ తామంతా ప్రభుత్వ ఉద్యోగులమనే ధీమా వారిని ముందుకు నడిపించేది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కొలువు నిర్వహిస్తున్న వారు కూడా తమ ఉద్యోగంపై అంతే భరోసాతో ఉండేవారు. అయితే ఆ ఉద్యోగం వదులుకుంటే ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ బతకడానికి భరోసా కల్పిస్తుందని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో వారి జీవితాలన్నీ తలకిందులయ్యాయి. నెల ముందుగానే ఉద్యోగాలు తొలగించి ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకుండా ఆశలు ఆవిరి అయ్యేలా తీసుకున్న చర్యలు వారిని రోడ్డున పడేశాయి. వారే గత కొన్నిరోజులుగా తమకు న్యాయబద్ధంగా రావలసిన బెనిఫిట్స్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఒంగోలు డెయిరీ ఉద్యోగులు.
ఏళ్ల తరబడి జిల్లావాసులకు సేవలందించిన ఒంగోలు డెయిరీని నష్టాల సాకు చూపి ప్రభుత్వం గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీకి కట్టబెట్టింది. ఈ ప్రక్రియ అంతా రోజుల వ్యవధిలోనే పూర్తవడంతో చేసేది లేక ఉద్యోగులు కొన్ని షరతులతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఒప్పుకున్నారు. తమకు రావలసిన జీతభత్యాలను పూర్తిగా చెల్లించడంతోపాటు, సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉపాధి చూపించాలనే రాజీమార్గాన్ని ప్రభుత్వం ముందుంచారు. అన్నింటికీ అంగీకరించిన ప్రభుత్వం తర్వాత వారిని రోడ్డునపడేసింది. కనీసం వారి గోడు కూడా ఆలకించడం లేదు. ఎటువంటి ప్రయోజనాలు చెల్లించకుండానే ఒప్పుకున్న దాని కన్నా నెలముందే అందరినీ తొలగించింది. ఇది అన్యాయమన్నా పట్టించుకోలేదు. కనీసం సంస్థ బాధ్యులు కూడా ఎటువంటి వివరాలు చెప్పలేదు. దీంతో అందరు నమ్మి మోసపోయారు.
ఆందోళన బాటలో ఉద్యోగులు
ఉన్న ఉపాధి పోయి, ప్రభుత్వం ఇచ్చిన మాటపై నోరు మెదపకపోవడంతో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే 50రోజులుగా వారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సజావుగా సాగిపోతున్న తమ జీవితాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వీరితోపాటు గతంలో ఉద్యోగ విరమణ చేసిన 56మంది ఉద్యోగులకు కూడా ఎటువంటి ప్రయోజనాలు అందలేదు. వారికి రావాల్సిన గ్రాట్యూటీ తదితర బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో వారంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. వారంతా డెయిరీ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలిపి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఉద్యోగ విరమణ చేసిన వారిలో పదిమంది బెనిఫిట్స్ తీసుకోకుండానే మృతిచెందడం గమనార్హం.
అంతా అగమ్యగోచరం
డెయిరీ ఉద్యోగుల జీవనం అగమ్యగోచరంగా తయారైంది. 1972 ఏర్పాటైన పాల ఉత్పతిదారుల సమాఖ్యను రెండు నెలల క్రితం ఆమూల్ అనే ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేసిన ప్రభుత్వం ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టిందని వాపోతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 68మంది ఉద్యోగులు, 56 మంది క్యాజువల్ లేబర్ను తొలగించి డెయరీని ఆమూల్ సంస్థకు అప్పంగిచారు. అయితే ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటిస్తే మంచి ప్యాకేజీ ఇస్తామని ఆశ చూపించి నెల ముందుగానే తొలగించారు. ఎలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు పలుమార్లు జిల్లా అధికారులు చర్చలు జరిపినా ఇంత వరకూ వారి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో గత నెల ఒకటి నుంచి పలు విధాలుగా డెయిరీ ఉద్యోగుల పోరాట కమిటీ పేరుతో ఆందోళనకు దిగారు. గత 21 రోజులుగా డెయిరీ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. అయితే వారికి కార్మిక సంఘాలతోపాటు రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. దీంతో డెయిరీ ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ప్రకటించారు.

ఆర్థిక శాఖ వద్ద ప్యాకేజీ ఫైలు
డెయిరీ ఉద్యోగుల వీఆర్ఎస్ ప్యాకేజీ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉంది. అక్కడ క్లియరెన్స్ రాగానే జీత భత్యాలతోపాటు, పెండింగ్లో ఉన్న అన్ని ప్రయోజనాలు వస్తాయి. అది ఎప్పుడు అవుతుందని కచ్ఛితంగా చెప్పలేను. మరికొద్ది రోజుల్లో వస్తుందని భావిస్తున్నా. ఉద్యోగుల సమస్యలు కూడా వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నా.
- జె. పరశురామయ్య, డెయిరీ సీఈవో
కుటుంబాల పరిస్థితి దుర్భరం
తొమ్మిది నెలలుగా జీతభత్యాలు రాక మా కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన పీఆర్సీ, డీఏ, ఇంక్రిమెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. వెంటనే జీతాలతోపాటు, రావలసిన బకాయిలన్నింటినీ ఇవ్వాలి. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.
- జి.నారాయణరావు, ఎస్డీ అకౌంటెంట్, డెయిరీ ఉద్యోగుల పోరాట కమిటీ కన్వీనర్
అప్పులు చేసి బతుకుతున్నాం
మా జీతభత్యాల నుంచి ప్రభుత్వం రికవరీ చేసిన ఈపీఎఫ్, ఎల్ఐసీ, కోఆపరేటివ్ సొసైటీ బకాయిలను వెంటనే చెల్లించాలి. నాకు రావలసిన బకాయిలు చెల్లించకపోగా జీతాలు కూడా నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నా. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. పిల్లల స్కూల్ ఫీజులు తదితరాలకు అప్పులు చేస్తున్నాం.
- టి. లక్ష్మీపద్మజ, జూనియర్ అసిస్టెంట్
వీఆర్ఎస్ ప్యాకేజీని వెంటనే అమలు చేయాలి
2020 వీఆర్ఎస్ ప్యాకేజీని వెంటనే డెయిరీ ఉద్యోగులకు చెల్లించాలి. బెన్ఫిట్స్ ఇవ్వకుండా నెలముందే తొలగించడం దుర్మర్గమైన చర్య. మా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ఆందోళన కొనసాగిస్తాం.
- ఈదర వెంకట్రావు, డెయిరీ ల్యాబ్ అసిస్టెంట్
పోరాటానికి అండగా ఉంటాం
డెయిరీలో ఉద్యోగ విరమణ చేసినవారికి రావలసిన గ్రాట్యు టీ బకాయిలు చెల్లించాలి. 2012 నుంచి ఇప్పటివరకు 56 మంది రిటైర్ అయితే పది మంది గ్రాట్యుటీ తీసుకోకుండానే మృతి చెందారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటాం.
- సిహెచ్. రాంబాబు, రిటైర్డ్ ఉద్యోగి