బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-01-07T07:47:21+05:30 IST

బర్డ్‌ఫ్లూ.. దేశంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావాన్ని నిర్ధారించగా.. తాజాగా ఏపీలో,

బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త!

  • రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..
  • ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
  • సీఎస్‌కు కేంద్ర వన్యప్రాణి విభాగం ఐజీ లేఖ
  • తెలంగాణలో బర్డ్‌ప్లూ ఆనవాళ్లు లేవు: తలసాని
  • కేరళలో 69,000 కోళ్లు, బాతుల వధ
  • వధించిన పక్షులకు నష్టపరిహారం చెల్లింపు
  • కోడిమాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం
  • నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో..
  • బర్డ్‌ఫ్లూ వైరస్‌ను నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం
  • గుంటూరు జిల్లాలో 9 కాకులు, 6 పావురాలు మృతి 


బర్డ్‌ఫ్లూ.. దేశంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావాన్ని నిర్ధారించగా.. తాజాగా ఏపీలో, కర్ణాకటలో కాకులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలంగాణలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోని రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ క్రమంగా విజృంభిస్తున్నందున.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బర్డ్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కలిగించి, జాగ్రత్తలు తెలియజేయాలని కేంద్ర మత్య్స, పశుసంవర్ధకశాఖ సూచించింది. కేరళ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కూడా అప్రమత్తం కావాలని కేంద్రం పేర్కొంది. పక్షుల అసాధారణ మరణాలపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాగా, బయో భద్రతా సూత్రాలు, వ్యక్తిగత పరిశుభ్రత, క్రిమి సంహారక చర్యలు తీసుకోవడంతోపాటు వంట, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం ద్వారా ఏఐ(ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా) వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చని కేంద్ర పశుపోషణశాఖ పేర్కొంది.


మరోవైపు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్‌ తివారీ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌కు లేఖ రాశారు. పెంపుడు జంతువులు, పక్షులకు వైరస్‌ విస్తరించే అవకాశముందని, బర్డ్‌ప్లూ లక్షణాలు కనిపిస్తే  తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 


రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తం..

కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది. జూపార్క్‌లతోపాటు, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల అసహజ మరణాలను గుర్తించాలని, వాటిని పరీక్షల కోసం పశువైద్య శాస్త్ర ప్రయోగశాలకు పంపి వ్యాధి నిర్ధారణ చేయాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ అధికారులను ఆదేశించారు. జూపార్క్‌లతోపాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేయాలని, వలసపక్షులు సంచరించే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేయాలని నిర్దేశించారు. 


చనిపోయిన పక్షుల సమాచారం ఏమైనా ఉంటే అటవీ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫోన్‌ చేసి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. 1300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాల ద్వారా బర్డ్‌ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బర్డ్‌ఫ్లూపై బుధవారం తన కార్యాలయంలో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు.


Updated Date - 2021-01-07T07:47:21+05:30 IST