2023 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు

ABN , First Publish Date - 2020-09-24T19:01:57+05:30 IST

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా..

2023 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు

రాష్ట్ర అభివృద్ధికి విమానాశ్రయ నిర్మాణం కీలకం

ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల్‌ వలవన్‌


విజయనగరం(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ముడిపడి ఉందని, భూ సేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్ర త్యేక కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ అన్నారు. జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూసేకరణ.. పురావాసం తదితర ఆంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్డుతో రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని, విమానాశ్రయాన్ని 2023 నాటికి పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని చెప్పారు.


భూసేకరణ పనులు పూర్తిచేసిన తరువాత నిర్మాణం మొదలు పెడతా మన్నారు. భూసేకరణలో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన ప్రభుత్వ భూమిని ముందుగా జీఎంఆర్‌ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ఎయిర్‌ పోర్టుకు అవసరమైన 2,750.78 ఎకరాల్లో ఇప్పటి వరకూ 2383.02 ఎకరాలను సేకరించామని, ఇంకా 71 ఎకరాల ప్రభుత్వ భూమిని పది రోజుల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ ప్రక్రియను పూర్తిచేసే బాధ్యత రెవెన్యూ డివిజనల్‌ అధికారిదేనని సృష్టం చేశారు. నిర్వాసితుల పునరావాస పనులపై కూడా సమీక్షించారు. నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు రెండు కాలనీలు నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు వల్ల 376 కుటుంబాలు నిర్వాసితులు అవుతు న్నారని, వారందరికీ పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌డీవో భవానీశంకర్‌ వివరించారు.


కార్యక్రమంలో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ కిశోర్‌కుమార్‌, డీఆర్‌వో గణపతిరావు, ప్రత్యేక ఉపకలెక్టర్లు జయరాం, వెంకటేశ్వరరావు, జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధి అప్పలనాయుడు, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ విజయశ్రీ, ఈఈ జీవీ రమణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌రాజకుమార్‌ పాల్గొన్నారు.




Updated Date - 2020-09-24T19:01:57+05:30 IST