Abn logo
Jun 17 2021 @ 22:16PM

భూసేకరణను అడ్డుకున్న గ్రామస్థులు

చింతోపు గ్రామంలో ఉద్రికత్త


తోటపల్లిగూడూరు, జూన్‌ 17 : ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు సేకరిస్తున్న భూసేకరణను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ఎమ్మెల్యే చొరవతో వివాదం సద్దుమణిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి. ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు మండలంలోని చింతోపు పంచాయతీ మజారా గ్రామమైన ఆంజనేయపురం వద్ద నీటిపారుదల శాఖకు చెందిన జాఫర్‌సాహెబ్‌ కాలువ కట్ట పోరంబోకు నుంచి 290 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ మేరకు సదరు స్థలంలో ప్లాట్లు సిద్ధం చేసేందుకు రెవెన్యూ అధికారులు గురువారం అక్కడకు చేరుకున్నారు. అయితే చాలా కాలంగా తమ స్వాధీనంలో ఉన్న ఈ భూమిని వదులుకోమని గ్రామస్థులు భీష్మించారు. దీంతో రెవెన్యూ అధికారులకు, గ్రామస్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినప్పటికీ గ్రామస్థులు అక్కడ నుంచి కదలలేదు. ఈ క్రమంలో అధికారులు సమస్యను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థులు కోరిన స్థలాన్ని వదిలి, మరో స్థలాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అధికారులు అదే ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మరో భూమిని ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేశారు.  ఈ క్రమంలో గ్రామస్థులకు, అధికారుల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది.