ప్రాణాలతో చెలగాటం వద్దు

ABN , First Publish Date - 2020-07-08T10:39:01+05:30 IST

నంద్యాల పట్టణ సమీపంలోని కుందూ ముంపు ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మాజీ ఎమ్మెల్యే భూమా

ప్రాణాలతో చెలగాటం వద్దు

ముంపు ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలేమిటి?

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి


నంద్యాల, జూలై 7: నంద్యాల పట్టణ సమీపంలోని కుందూ ముంపు ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి పేదల ప్రాణాలతో  చెలగాటం ఆడవద్దని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ   పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి కుందూ ముంపు ప్రాంతంలో ప్లాట్లు వేయడం అవివేకమని అన్నారు. కుందూ వరద ప్రభావం నంద్యాల పట్టణంపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు రుజువైందని అన్నారు.


కుందూ విస్తరణ, ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం కోసం  మట్టిని తవ్వి పనులకు ఉపయోగించేందుకు  పదేళ్ళ క్రితం 200 ఎకరాలను రైతుల నుంచి అప్పటి ప్రభుత్వం భూ సేకరణ చేసిందని గుర్తు చేశారు. కుందూ రక్షణ పనులు చేపట్టాల్సిన ఈ స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇండ్ల స్థలాలకు ప్లాట్లు వేయడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని అన్నారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో జీ+3 టిడ్కో గృహాలను నిర్మించిందని, వాటిని పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.


నివాసానికి అనువైన ప్రదేశాలలో ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రతి రోజూ బిక్కు బిక్కుమంటూ జీవించేలా కుందూనది పక్కనే  7,500 మందికి స్థలాలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.  రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ స్థలాలు కేటాయించాలని, అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని అన్నారు. అర్హులకు అన్యాయం జరిగితే చివరంటా పోరాడతామని ఆయన అన్నారు. 

Updated Date - 2020-07-08T10:39:01+05:30 IST