బిల్లులందక...పనులు సాగక

ABN , First Publish Date - 2021-10-15T04:59:17+05:30 IST

శివసాగర్‌ బీచ్‌అభివృద్ధిపై అఽధికారులకు చిత్తశుద్ధి కరువయ్యింది. గతంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా కాంట్రాక్టర్‌ నిలిపివేశారు.

బిల్లులందక...పనులు సాగక
శివసాగర్‌బీచ్‌లో పనులు నిలిచిపోయిన దృశ్యం

  కొరవడిన వసతులు...పర్యాటకుల బేజారు

 శివసాగర్‌ బీచ్‌లో  నిలిచిన పనులు 

వజ్రపుకొత్తూరు:శివసాగర్‌ బీచ్‌అభివృద్ధిపై అఽధికారులకు చిత్తశుద్ధి కరువయ్యింది. గతంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో  అర్ధాంతరంగా కాంట్రాక్టర్‌ నిలిపివేశారు.  జిల్లాలో అత్యధికంగా ఇక్కడకు పర్యాటకులు వస్తున్నా వసతు లు కొరవడ్డాయి. కనీస సదుపాయాలు లేకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అవస్థలకు గురవుతు న్నారు. టీడీపీహయంలో శివసాగర్‌ బీచ్‌లో అభివృద్ధి పనులకు రూ.91 లక్షలు మంజూరుకావడంతో  హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. ఇంతలో హుద్‌హుద్‌, తితలీ తుఫాన్‌ వల్ల పనులకు ఆటంకం కలిగింది.  షెడ్లు, రక్షణగోడ ప్లాట్‌ పారం నిర్మించారు. తుఫాన్‌ సమయంలో సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో  రక్షణగోడ, సిమెంటు ప్లాట్‌పారం కొట్టుకుపోయాయి. రూ.25 లక్షల మేర జరిగిన పనులకు బిల్లులు చెలించాలని కాంట్రాక్టర్‌ అధికారు లను కోరారు. జరిగిన మేర పనులకు బిల్లులు చెల్లించకపో వడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. 

ప్రతిపాదనతోనే కాలయాపన

వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీచ్‌లో నిలిచిపోయిన పనులు మంత్రి అప్పలరాజు  పరిశీలించారు. పనులు పూర్తిచేయడమే కాకుండా మరో రూ.కోటి 50 లక్షలతో మరిన్ని అభివృద్ధిపనులు చేపడతామని, అందుకు ప్రతి పాద నలు సిద్ధంచేయాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశిం చారు. పనులకు ప్రతిపాదనలుచేసినా నిధులు మంజూరులో కాలయాపన జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు సేదదీరేందుకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు,  బెంచీలు  సైతం కనీసం ఏర్పాటుచేయలేదు. గతంలో అప్పటి  కలెక్టర్‌ నివాస్‌ శివసాగర్‌ తీరాన్ని పరిశీ లించి  బీచ్‌ రోడ్డు విస్తరణకు కొలతలు వేయాలని రెవెన్యూ అధికారులను  ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు  అధికారులు  కొలతలువేసి జిల్లా  పంపించినా ప్రతిపాదనలు అటకెక్కాయి. కాగా శివసాగర్‌ బీచ్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించామని పర్యాటకశాఖ ఇంజినీరు మదన్‌మోహన్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే   పనులు ప్రారంభిస్తామని చెప్పారు.




Updated Date - 2021-10-15T04:59:17+05:30 IST