బీర్బల్ చాతుర్యం
ABN , First Publish Date - 2021-02-04T05:30:00+05:30 IST
అక్బర్ ఒకరోజు రాజ సలహాదారు పదవి ఖాళీగా ఉందని ప్రకటించాడు. సభలోని చాలామంది ఆ పదవిని తమకే దక్కాలని మనసులో అనుకోసాగారు.
అక్బర్ ఒకరోజు రాజ సలహాదారు పదవి ఖాళీగా ఉందని ప్రకటించాడు. సభలోని చాలామంది ఆ పదవిని తమకే దక్కాలని మనసులో అనుకోసాగారు. రాజ సలహాదారు పదవి చేజిక్కించుకోవాలని ఎక్కువ మంది భావిస్తుండడంతో అక్బర్ ‘మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గిన వారిని రాజ సలహాదారుగా నియమిస్తాను’ అని చెబుతాడు. దాంతో అందరూ ఏంటా పరీక్ష అని కుతూహలంతో ఉంటారు. అందరినీ వరుసలో నిల్చోమంటాడు అక్బర్. అందరూ చూస్తుండగానే తన నడుముకు చుట్టి ఉన్న వస్త్రాన్ని కింద పారేస్తాడు.
‘ఆ వస్త్రాన్ని నా తల నుంచి పాదాల వరకు కప్పాలి. ఇదే పరీక్ష’ అని చెప్పి నేలపై పడుకొంటాడు.. అందరూ అది చాలా సులువైన పని అని, చిటికెలో చేసేస్తాం అని అనుకుంటారు. ఒకరి తరువాత ఒకరు ఆ వస్త్రాన్ని అక్బర్ తల నుంచి పాదాల వరకు కప్పేందుకు ప్రయత్నించి విఫలమవుతారు. సరిగ్గా అప్పుడే సభలోకి ప్రవేశించిన బీర్బల్ అక్బర్ నేలపై పడుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఏం జరుగుతుందో గమనిస్తూ ఒక మూలన కూర్చుంటాడు.
‘బీర్బల్ నువ్వు కూడా ప్రయత్నిస్తావా?’అని అక్చర్ మహారాజు అడగగానే ‘నేను కచ్చితంగా ప్రయత్నించి చూస్తాను’ అంటాడు బీర్బల్. ‘మహారాజా! మీ కాళ్లను కొద్దిగా మడుస్తారా!’ అని అడుగుతాడు. అక్బర్ తన కాళ్లను మడవగానే బీర్బల్ ఆ వస్త్రాన్ని తల, కాళ్లు కనిపించకుండా కప్పుతాడు. బీర్బల్ చాతుర్యానికి అక్బర్‌తో సహా అంతా నోరెళ్లబెడతారు.