బర్డ్‌ఫ్లూపై అలర్ట్‌

ABN , First Publish Date - 2021-01-10T05:28:49+05:30 IST

కరోనా పీడ నుంచి విముక్తి లభించకముందే బర్డ్‌ఫ్లూ వార్తలు కలకలం రేపుతున్నాయి. కరోనా వైరస్‌ తొలి దశలో ఉమ్మడి జిల్లాలో కోళ్ల విక్రయాలు భారీగా పడిపోగా, దాణా సరఫరా నిలిచి కోళ్లఫారాల యజమానులు ఉచితంగా కోళ్లను పంచిన ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అది మరవక ముందే బర్డ్‌ఫ్లూ వార్తలు పెంపకందారులు, మాంసం ప్రియుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

బర్డ్‌ఫ్లూపై అలర్ట్‌
కనగల్‌ మండలం బాబాసాయిగూడెంలో కోళ్లను పరిశీలిస్తున్న ఆర్‌ఆర్‌టీ సభ్యుడు

హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌లో తాజాగా కేసులు?

ఉమ్మడి జిల్లాలో 66 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంల ఏర్పాటు

మృతిచెందిన జీవాల నుంచి శాంపిళ్ల సేకరణ

నల్లగొండ, జనవరి 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా పీడ నుంచి విముక్తి లభించకముందే బర్డ్‌ఫ్లూ వార్తలు కలకలం రేపుతున్నాయి. కరోనా వైరస్‌ తొలి దశలో ఉమ్మడి జిల్లాలో కోళ్ల విక్రయాలు భారీగా పడిపోగా, దాణా సరఫరా నిలిచి కోళ్లఫారాల యజమానులు ఉచితంగా కోళ్లను పంచిన ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అది మరవక ముందే బర్డ్‌ఫ్లూ వార్తలు పెంపకందారులు, మాంసం ప్రియుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్‌ మొన్నటి వరకు ఇతర రాష్ట్రాలకే పరిమితం అనుకుంటుండగా, తాజాగా హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడటంతో అంతా అలర్ట్‌ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలోని కేరళ, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూతో పక్షులు, కోళ్లు, కాకులు, పావురాలు, విదేశీ పక్షులు మృతిచెందాయి. ఈ వార్తలతో ఉమ్మడి జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అఽధికారులు ఇప్పటికే అలర్టయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూ కేసులు నమోదుకాకున్నా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పశు సంవర్ధక శాఖల అధికారులను అప్రమత్తం చేసింది.


66 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన ఉమ్మడి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు, 66 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం(ఆర్‌ఆర్‌టీ)లు ఏరార్పటు చేశారు. ఒక్కో టీంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. అందులో ఓ పశువైద్యుడు, కంపౌండర్‌, సహాయకుడు ఉంటారు. ఈ బృందాలు ఇప్పటికే అన్ని మండలాల్లో పర్యటిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 2వేల పౌలీ్ట్ర ఫారాల్లో సుమారు 10కోట్ల వరకు కోళ్లు పెరుగుతున్నాయి. అదే విధంగా 200 వరకు దేశవాళీ కోళ్ల ఫారాలు ఉండగా, కృష్ణా, మూసీ ఆయకట్టు ప్రాంతాల్లో 40వేల వరకు బాతులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌టీ బృందాలు పర్యటిస్తున్నాయి. ఎక్కడైనా కోళ్లు, బాతులు గమనించదగిన సంఖ్యలో మృతిచెందితే ఈ బృందం సభ్యులు వాటిని పరిశీలించి రక్తనమూనాలు సేకరిస్తున్నారు. ఆ నమూనాలను హైదరాబాద్‌లోని వెటర్నరీ బయోలాజికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(వీబీఆర్‌ఐ)కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో గత మూడు రోజులుగా 72 నమూనాలు సేకరించి పంపగా, ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. జిల్లాలోని నేరేడుగొమ్ము, చందంపేట, అడవిదేవులపల్లి, శాలిగౌరారం మినహా అన్ని మండలాల్లో కోళ్ల ఫారాలు ఉన్నాయి.


గతంలో కనిపించని వైరస్‌ లక్షణాలు

ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు. 2015లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు కూడా ఉమ్మడి జిల్లా సేఫ్‌గా ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కారణంగా అడవిజాతి పక్షులైన కాకులు, నెమళ్లు, పావురాలు, పక్షులు, కొంగలు, విదేశీ పక్షులకు బర్డ్‌ఫ్లూ(వైరల్‌ డిసీజ్‌) వస్తుంది. అది పెంపుడు జాతి పక్షులైన కోళ్లు, బాతులు ఇతర పక్షులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వీటి నుంచి మనుషులకు వైరస్‌ సోకే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.


బర్డ్‌ఫ్లూ లక్షణాలు

బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్లను సులువుగా గుర్తించవచ్చు. వైరస్‌ సోకిన కోళ్లలో ప్రధానంగా బలహీనత లక్షణం కనిపిస్తుంది. నీరసం కారణంగా కోళ్లు నిలబడలేవు. అంతేగాక కోడి జుట్టు నల్లబడుతుంది. కాళ్లపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు ఎర్రబారి ఉంటాయి. చివరికి అవి మృతిచెందుతాయి. ఈ కోళ్లు సమూహంలో ఉంటే మిగతా వాటికి కూడా తొందరగానే వైరస్‌   వ్యాప్తి చెందుతుంది.


కోళ్లు, బాతులు చనిపోతే సమాచారం ఇవ్వాలి : వి.శ్రీనివాసరావు, నల్లగొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

జిల్లాలో ఎక్కడైనా కోళ్లు, బాతులు, కాకులు, పావురాలు, నెమళ్లు, కొంగలు చనిపోయినట్లు తెలిస్తే మా శాఖ సిబ్బందికి సమాచారం అందజేయాలి. వెంటనే అక్కడికి ఆర్‌ఆర్‌టీ బృందాలను పంపి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతాం. మూడు రోజులుగా పంపిన శాంపిళ్లల్లో ఎలాంటి బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. జిల్లాకు బర్డ్‌ఫ్లూ రాలేదు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. పుకార్లను నమ్మవద్దు. అయితే అప్రమత్తంగా ఉండటం అవసరం.

Updated Date - 2021-01-10T05:28:49+05:30 IST