బాన్సువాడలో నేడు బీజేపీ బహిరంగ సభ

ABN , First Publish Date - 2021-02-25T04:22:42+05:30 IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభకు ఆయనతో పాటు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హాజరవుతున్నారు.

బాన్సువాడలో నేడు బీజేపీ బహిరంగ సభ
బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

హాజరవుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
పార్టీలో చేరనున్న మల్యాద్రిరెడ్డి
నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభకు ఆయనతో పాటు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హాజరవుతున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే అరుణతారలతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి మల్యాద్రిరెడ్డి, అతని అనుచరులతో కలిసి పార్టీలో చేరుతున్నారు. బాన్సూవాడ వీక్లీమార్కెట్‌ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ బహిరంగ సభలో ఆయనతో పాటు వందలాది మంది మద్దతుదారులతో పార్టీలో చేరుతున్నారు.  బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. వచ్చే ఎన్నికలపై దృష్టిపెట్టిన మల్యాద్రిరెడ్డి ముందస్తుగా నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరుతున్నారు. పార్టీ సీనియర్‌ నేతలందరు హామీ ఇవ్వడంతో ఆయన తన అనుచరులతో కలిసి నేడు చేరుతున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల నేతలు యువజన సంఘాల ప్రతినిధులు చేరనున్నా రు. నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌, వర్ని, కోటగిరి, రుద్రూర్‌, మోస్రా, చందూర్‌ మండలాల పరిధిలోని ఆయన అనుచరులు చేరుతున్నారు. మల్యాద్రిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బం డి సంజయ్‌ని ఉమ్మడి జిల్లాకు చెందిన బస్వ లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే అరుణతారలతో కలిసి సభ ఏర్పాట్లపై చర్చించారు.
ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టిన బీజేపీ నేతలు
గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఫలితాల తర్వాత బీజేపీ నేతలు ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. పార్లమెంట్‌ గెలుచుకోవడంతో నియోజకవర్గాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. బోధన్‌ నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమందిని చేర్చుకోగా ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ నియోజకవర్గం ఉండడంతో నేతలు పార్టీ పరంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. కొంత ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్‌ నేతలను పార్టీ లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల పరిధిలో క్యాడర్‌ను బలోపేతం చేస్తున్నారు. దానిలో భాగంగానే మల్యాద్రిరెడ్డిని ప్రస్తుతం బీజేపీలో చేర్చుకుంటున్నారు. నియోజకవర్గంలో కొంత క్యాడర్‌ ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ను తట్టుకునేవిధంగా బలోపేతం చేసేందుకు ఈ చేరికలకు అవకాశం ఇస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
కాంగ్రెస్‌ నుంచి కొనసాగుతున్న వలసలు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు గత కొన్ని నెలలు గా వలసపోతున్నారు. గత నెలలో మేడపాటి ప్రకాష్‌ బోధన్‌ లో జరిగిన బహిరంగ సభలో బీజేపీలో చేరారు. ఆ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం కార్యక్రమాలను చూస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మల్యాద్రిరెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌ ను వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎంపీటీసీలు, ఇతర నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సీనియర్‌ నేతలు బీజేపీలో చేరుతుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా కలవరం మొదలైంది. సీనియర్‌ నేతలు మాత్రం కొంతమంది వెళ్లిన తమకు వచ్చే నష్టమేమి లేదని వారంటున్నారు.

Updated Date - 2021-02-25T04:22:42+05:30 IST