పేదల సొంతింటి కలకు కళ్లెం.. డబ్బులివ్వకపోతే కూల్చివేయిస్తా!

ABN , First Publish Date - 2021-06-14T18:19:59+05:30 IST

అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో విస్తరించిన దళారుల దందా పేద, మధ్య తరగతి

పేదల సొంతింటి కలకు కళ్లెం.. డబ్బులివ్వకపోతే కూల్చివేయిస్తా!

  • లోపాల బూచీ.. మామూళ్లకు పేచీ
  • ఇంటి లోపాలు చూపి బెదిరింపులు.. 
  • అల్వాల్‌లో డబ్బులు దండుకుంటున్న దళారులు 

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో విస్తరించిన దళారుల దందా పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కలలకు కళ్లెం వేస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద వాలిపోతున్న కొన్ని ముఠాలు నిర్మాణదారులను బెదరించి దండుకోవడమే  లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని చోట్ల నకిలీ విలేకరులతో, మరికొన్ని చోట్ల జీహెచ్‌ఎంసీ చట్టం తెలిసిన కొంతమందితో ఈ గ్యాంగ్‌లు ఏర్పడ్డాయి. అల్వాల్‌లో ప్రతి నెలా లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని కొంత మంది కిందిస్థాయి అధికారులు కూడా వీరికి తోడయ్యారు. భవన నిర్మాణం ప్రారంభించగానే లోపాలను ఎత్తిచూపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. 


డబ్బులివ్వకపోతే కూల్చివేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అల్వాల్‌లో ఇండ్లు నిర్మిస్తున్న వారు గగ్గోలు పెడుతున్నారు. అల్వాల్‌ సర్కిల్‌ పట్టణ ప్రణాళికా విభాగం ఏటా 400 నుంచి 500 నిర్మాణాలకు అనుమతి ఇస్తుంది. అనుమతి పొందిన యజమానులు ప్లాన్‌కు కాస్తా అటుఇటుగా మార్చి నిర్మాణాలు చేపడుతుంటారు. కొందరు అదనపు అంతస్తులు కడతారు. ఇచ్చిన ప్లాన్‌కు అనుగుణంగా భవన నిర్మాణం చేస్తేనే టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (నివాస యోగ్యతా పత్రం -ఓసీ) ఇస్తారు. ప్లాన్‌కు అనుగుణంగా లేనివారు కిందిస్థాయి సిబ్బందితో మాట్లాడుకుని కొంత డబ్బులు చెల్లించి ఓసీ తీసుకుంటారు. ఈ చిన్న పాటి లోపాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నారు. దళారులు, నకిలీ విలేకరులు ఈ దందాలో కీలక భూమికను పోషిస్తున్నారు. అల్వాల్‌లో ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో ఉంటాయని స్ధానికులు పేర్కొంటున్నారు.


అక్రమ వసూళ్లకు నిదర్శనాలు

అల్వాల్‌ హిల్స్‌, మచ్చబొల్లారం, సెయింట్‌ మైకేల్‌ స్కూల్‌, పరిసర ప్రాంతాలు దళారులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు.   వారం రోజులుగా ఒక దళారి అల్వాల్‌ వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తున్న ఓ భవన  యజమానికి ఫోన్‌చేసి ‘అక్రమ నిర్మాణం చేస్తున్నారు. తమ గ్రూప్‌కు పెద్దఎత్తున డబ్బులు ఇవ్వా’లని డిమాండ్‌ చేశారు. తీరా భవన యజమాని ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి విచారణ చేయగా ఓ విలేకరితోపాటు మరో నలుగురు ఉన్నారని నిర్థారించారు. వారిపై త్వరలో ఉన్నతాధికారులతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-14T18:19:59+05:30 IST