Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్తమోడుతున్న రహదారులు

నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది భారీగా పెరుగుదల

మరణాలు, క్షతగాత్రుల సంఖ్య కూడా...

నియంత్రణపై గట్టిగా దృష్టిపెట్టని పోలీసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదం చోటుచేసుకుంటోంది. ఒకరిద్దరూ ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లుగా రోడ్డుప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుతూ వచ్చినప్పటికీ, ఈ ఏడాది మళ్లీ పెరగడం, అది కూడా గత ఆరు నెలల్లో మరింత ఎక్కువ కావడంతో పోలీసులు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి, వాటిని అధిగమించడంపై అధికారులు సరిగా దృష్టిసారించకపోవడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు నాలుగైదేళ్ల క్రితం కొన్ని చర్యలు తీసుకున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పక్కాగా పాటించేలా చూడడంతో పాటు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, కౌన్సెలింగ్‌ చేయడం వంటివి చేపట్టారు. అలాగే  మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సహాయంతో నగరంలోని ట్రాఫిక్‌ కూడళ్ల అభివృద్ధి, కీలక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వంటి పనులు చేపట్టారు. దీనివల్ల 2017 తర్వాత 2020 వరకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015లో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,295 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 375 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,341 మంది గాయపడ్డారు. 2016లో 1,451 ప్రమాదాలు జరిగితే 371 మంది ప్రాణాలు కోల్పోగా, 1,502 మంది గాయపడ్డారు. 2017లో 1,376 ప్రమాదాలు జరగ్గా...331 మంది మృతిచెందగా, 1,468 మంది గాయపడ్డారు. 2018లో 1,466 ప్రమాదాలు జరగ్గా, 325 మంది ప్రాణాలు కోల్పోగా 1,438 మంది గాయపడ్డారు. 2019లో 1,410 ప్రమాదాలు జరగ్గా, 327 మంది మృతిచెంద గా, 1,446 మంది క్షతగాత్రులయ్యారు. 2020లో 1,146 రోడ్డు ప్రమాదాలు జరిగితే 261 మంది మృతిచెందగా, 1,049 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికే 1,250 ప్రమాదాలు జరిగాయి. 291 మంది ప్రాణాలు కోల్పోగా, 1,251 క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో కూడా గత నాలుగైదు నెలల్లో చోటుచేసుకున్నవే అధికంగా వుండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. కోర్‌సిటీలో పగటిపూట ప్రమాదాలు జరుగుతుంటే, పెందుర్తి, పోతినమల్లయ్యపాలెం, పోర్టు రోడ్డు, గాజువాక వంటి ప్రాంతాల్లో రాత్రిపూట ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత ఏడాది 112 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికే 208 ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 71 మంది గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి 20 మంది మృతిచెందగా, మరో 105 మంది గాయపడడం గమనార్హం.


లోతుగా దృష్టిసారించని పోలీసులు

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే అప్పటికి హడావిడి చేస్తున్న పోలీసులు ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోవడం లేదు.  ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించడం లేదు. నగరంలో తరచుగా పలుచోట్ల ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లు పనిచేయడం లేదు. కేవలం కానిస్టేబుల్‌ లేదా హోంగార్డు చేతి సైగల ద్వారానే వాహనాల రాకపోకలను నియంత్రించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చినట్టవుతుంది. అంతేకాకుండా వాహనాల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా ట్రాఫిక్‌ కూడళ్లను మరింత అభివృద్ధి చేయాల్సి  ఉంది. అలాగే నగరంలోని ప్రధాన రహదారుల్లో పెరిగిపోయిన ఆక్రమణలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అదేవిధంగా పగటిపూట నగరంలోకి అత్యవసరమైనవి మినహా భారీ వాహనాలు ప్రవేశించేందుకు అనుమతి లేదు. అయితే వ్యాపారుల ఒత్తిళ్లకు తలొగ్గి వాహనాలను పోలీసులు వదిలేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాజువాక నుంచి తగరపువలస వరకూ జాతీయ రహదారి వెంబడి సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ భారీ వాహనాలను నిలిపివేస్తున్నారు. మలుపుల్లో పార్కింగ్‌ చేయడం, రోడ్లపై వెలుతురు లేకపోవడం వల్ల వాహన చోదకులు నిలిపివుంచిన వాహనాలను సకాలంలో గుర్తించలేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటి కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.


సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

2015 1295 375 1341

2016 1451 371 1502

2017 1376 331 1468

2018 1466 325 1438

2019 1410 327 1446

2020 1146 261 1049

2021 1250 291 1251

(అక్టోబర్‌ 31 నాటికి)


రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలివి...

- వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తుండడం, మితిమీరిన వేగంతో ప్రయాణం, సిగ్నల్‌ జంపింగ్‌..

- నగర పరిధిలో జాతీయ రహదారికి సమాంతరంగా సర్వీసు రోడ్లు లేకపోవడం

- రోడ్డు వెంబడి రాత్రివేళ భారీ వాహనాలను పార్కింగ్‌ చేయడం

- ప్రధాన రహదారుల్లో ఆక్రమణలు

- కొంతమంది ట్రాఫిక్‌ పోలీసులు నిషేధిత సమయంలో భారీ వాహనాలను నగరంలోకి అనుమతించడం

- కూడళ్లలో తరచుగా సిగ్నల్‌ లైట్లు పనిచేయకపోవడం

- వీధిదీపాలు మరమ్మతుల కారణంగా రాత్రివేళ రోడ్లపై వెలుతురు లేకపోవడం 

- ట్రాఫిక్‌ విధుల్లోని కానిస్టేబుళ్లను ఇతర విభాగాలకు పంపించి, హోంగార్డులకు ట్రాఫిక్‌ బాధ్యతలు కేటాయించడం 


Advertisement
Advertisement