పరీక్షలపై నీలినీడలు

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

సరిగ్గా వార్షిక పరీక్షలకు పిల్లలంతా సిద్ధం కాబోతున్న వేళ మళ్లీ కరోనా తనపంజా విసురుతూ ఉగ్రరూపం దాల్చింది.

పరీక్షలపై నీలినీడలు

గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ పరిస్థితి 

టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళం 

డిగ్రీ విద్యార్థులదీ అదే దుస్థితి 

ఆన్‌లైన్‌ తరగతులపైనా అనేక సందేహాలు

మళ్లీ ఈ యేడు కూడా విద్యాసంస్థల కథ ముగిసినట్లేనా...? 

నిర్మల్‌, ఏప్రిల్‌ 13 (ఆంఽధ్రజ్యోతి) : సరిగ్గా వార్షిక పరీక్షలకు పిల్లలంతా సిద్ధం కాబోతున్న వేళ మళ్లీ కరోనా తనపంజా విసురుతూ ఉగ్రరూపం దాల్చింది. గత సంవత్సరం మాదిరిగానే మార్చి నుంచి మొదలైన కరోనాసెకండ్‌వేవ్‌ రోజురోజుకూ విస్తరిస్తూ జనా న్ని హడలెత్తిస్తోంది. ప్రతీరోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా వైద్య, ఆరోగ్యశాఖ అలాగే మిగతా సంబంధిత శాఖలన్నీ హడలెత్తిపోతున్నాయి. ప్రభుత్వం కరోనాతీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలను నిర్వహించకుండా కేవ లం టీచర్లు మాత్రమే హాజరయ్యేట్లు చూస్తున్నారు. ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యాసంస్థలు కూడా తరగతులను నిలిపివేసి ఆన్‌ లైన్‌ తరగతుల భోధనను నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరం పదవతరగతి పరీక్షలను రాయకుండానే ఆ పరీక్షలకు ఫీజు చెల్లించిన వారిని పాస్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్మీడియట్‌ది కూడా అదే పరిస్థితి. ఈ సారి గత సంవత్సరం కన్నా కరోనా ఉధృతితీవ్రంగా ఉండడంతో పరీక్షల నిర్వహణపై సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. వందలాదిమంది విద్యార్థులను గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయించడం సాహసోపేతమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఇలాంటి సాహసాలు చేస్తే ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌ సోకితే పరిస్తితులన్నీ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలుంటాయన్న ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి కూడా గత సంవ త్సరం మాదిరిగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పదవతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా మొదలుకాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంటోంది. దీంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతుల పరిస్థితి కూడా అయోమయంగా ఉందంటున్నారు. ఆన్‌లైన్‌ బోధన విషయంలో సంబంధిత టీచ ర్లు, లెక్చరర్లు పర్యవేక్షించేందుకు ఇంటింటికీ తిరగలేని పరిస్థితులున్నాయి. కరోనా తీవ్రతదృష్ట్యా ఇతరులెవరినీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతోటీచర్లు పాఠశాలలు, కాలేజీలకే పరిమితమైపోతున్నారు. వెరసి ఆన్‌లైన్‌ తరగతులపైనా అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు చాలా చోట్ల ఇప్పటికీ నెట్‌వర్క్‌ అందక వారంతా ఆన్‌లైన్‌ పాఠశాలకు దూరమవుతున్నారు. ఖానాపూర్‌, కుభీర్‌, కడెం, దస్తూరాబాద్‌, పెంబి తదితర మారుమూల మండలాల్లోని చాలా పల్లెలకు సిగ్నల్‌ సౌకర్యం లేని కారణంగా విద్యార్థులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించడం కత్తీమీద సాములాగా మారే అవకాశం ఉందంటున్నారు. 

ఇప్పటికీ ఆన్‌లైన్‌ తరగతులపై గందరగోళమే

ఆన్‌లైన్‌ విద్యాభోధనపై అనేక రకాల సందేహాలు కొనసాగుతున్నాయి. టీవీలు, సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌ లైన్‌ భోధనకు సంబంధించి ప్రసారాలు జరుగుతున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఈ తరగతులను వినడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీవీ సౌకర్యం లేకపోవడం, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో వి ద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమైపోతున్నారు. అయితే మొక్కుబడిగా మాత్రం ప్రసారాలు కొనసాగుతున్నాయే తప్ప ఉన్నతాధికారుల పకడ్బందీ పర్యవేక్షణ సైతం కరువైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్షభోధనకు పరిస్థితులు అనుకూలించకపోతుండడంతో ప్రభుత్వం సైతం ఆన్‌లైన్‌ భోధనవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌ భోధన అయిందనిపిస్తున్నారే తప్పా విద్యార్థుల సందేహాలకు పూర్తిస్థాయి పరిష్కారం దొరకడం లేదన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. 

పరీక్షలపై ఉత్కంఠ

కాగా ఇప్పటికే హైస్కూల్‌ యాజమాన్యాలు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేయగా ఇంటర్‌ విద్యార్థుల నుంచి జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు సైతం ఫీజులు వసూలు చేసి పరీక్షల కోసం నామినల్‌ రోల్స్‌ కూడా సిద్ధం చేశాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే గతం మాదిరిగానే కరోనా ఈసారి కూడా పరీక్షల సమయంలోనే విభృంభించిపోవడంతో అధికారులు ఈ పరీక్షల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వేలసంఖ్యలో ఈ పరీక్షలు రాసే విద్యార్థులు కరోనాబారిన పడితే ప్రమాదకరమని భావిస్తున్నారు. ఒక్కోగదిలో కనీసం 20 మందికి తగ్గకుండా పరీక్షలను రాయించాలనుకున్నప్పటికీ ఏదోరకంగా వైరస్‌వ్యాప్తి జరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో ఈ సారి పదవ, ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా అందరిని ఉత్తీర్ణత చే యడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

డిగ్రీ, పీజీ విద్యార్థులదీ ఇదే దుస్థితి

సాధారణ డిగ్రీతో పాటు బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ సారి సెమిస్టర్‌ పరీక్షలను ప్ర త్యక్షంగా నిర్వహించడం కుదరదంటున్నారు. వీరికి మొదటి సెమిస్టర్‌ను పక్కన పెట్టి రెండో సెమిస్టర్‌కు సంబంధించిన పాఠాలు భోధించేందుకు ఆయా ఇంజ నీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అలాగే డిగ్రీ యాజమాన్యాలు సైతం ఇదే తర హా వ్యవహరించాలంటూ యోచిస్తున్నాయి. రాష్ట్ర ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయంపైనే పరీక్షల నిర్వహణ అంశం ఆధారపడి ఉంటుందంటున్నారు. పదవ, ఇం టర్మీడియట్‌ అధికారులతో పాటు ఆయా యూనివర్సీటీలకు చెందిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే వార్షిక పరీక్షలకు సంబందించి తమ అభిప్రాయాలను సర్కారుకు నివేదించినట్లు తెలిసింది. వీరందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం రాబోయే రోజుల్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రులోలనూ కొనసాగుతోంది. 

Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST