Abn logo
Jul 28 2021 @ 02:39AM

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బొమ్మై

  • బసవరాజకు చాన్స్‌.. శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవం
  • కేంద్ర మంత్రులు ప్రధాన్‌, కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నిక
  • యడ్డికి మిత్రుడు.. లింగాయత్‌ వర్గానికే దక్కిన పీఠం
  • డిప్యూటీ సీఎంలుగా అశోక్‌, గోవింద, శ్రీరాములు
  • నేటి ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం


బెంగళూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా లింగాయత్‌ సామాజిక వర్గానికి చెం దిన బసవరాజ బొమ్మై ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులో మంగళవారం జరిగిన బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో 61 ఏళ్ల బొమ్మై పేరును సీఎం పదవికి యడియూరప్ప ప్రతిపాదించగా గోవింద కారజోళ బలపరిచారు. బీజేపీ అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డిలు.. బొమ్మై పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలంతా కరతాళ ధ్వనులతో ఆమోదించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పును సాఫీగా జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ అధిష్ఠానం యడియూరప్ప వారసుడి ఎంపిక ప్రక్రియను అంతే సాఫీగా పూర్తి చేయడంలో సఫలీకృతమైంది. ఆర్‌.అశోక్‌(వక్కలిగ),గోవింద కారజోళ(దళిత), బి.శ్రీరాములు (బోయ) ఉప ముఖ్యమంత్రులుగా బొమ్మై కొలువులో చేరనున్నారు. వీరిలో గోవింద కారజోళ యడియూరప్ప ప్రభుత్వంలోనూ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ అధిష్ఠానం తనపై పెట్టిన పెద్ద బాధ్యతను నెరవేరుస్తానని, రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలబెడతానని కొత్త ముఖ్యమంత్రిగా నియమితులైన బసవరాజ బొమ్మై చెప్పారు. యడియూరప్ప తన పేరును ప్రతిపాదించి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే అందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం బసవరాజ బొమ్మై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కోరారు. బీజేపీ శాసనసభ పక్ష నేత గా ఎన్నికైనట్లు అధికారిక లేఖను అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సీఎంగా బొమ్మైతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.  


ఆద్యంత ఉత్కంఠే!

రాష్ట్రంలో బలమైన లింగాయత్‌ కులానికి చెందిన యడియూరప్ప నిష్క్రమణ అనంతరం వారసుడి ఎం పిక ఎలా జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం యడియూరప్పకు అత్యంత ఆప్తుడైన బసవరాజ బొమ్మై పేరునే ఖరారు చేసింది. అధిష్ఠానం పరిశీలకులుగా విచ్చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డి పార్టీలోని అత్యున్నత నిర్ణాయక కోర్‌ కమిటీ సమావేశంలో బొమ్మై పేరును ప్రతిపాదించారు. ఈ సమావేశానికి హాజరవుతూనే యడ్డి విజయ సంకేతం చూపడంతో కథ సుఖాంతమైందన్న విషయం అందరికీ అర్థమైంది. కాగా, సీఎం పదవికి రాజీనామా చేయడంపై ఆగ్రహంతో ఉన్న యడియూరప్పను పార్టీ అధిష్ఠానం కూల్‌ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఆప్తుడైన బొమ్మైని సీఎం పదవికి ఎంపిక చేయడం ద్వారా యడ్డి ఆగ్రహాన్ని కొంత మేరకు చల్లార్చిందని పరిశీలకులు భావిస్తున్నా రు. జనతాపరివార్‌కు చెందినవారు కావడం, యడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొంది అధిష్ఠానం పెద్దలతోనూ సత్సంబంధాలు కలిగివుండడం, బీజేపీలో సౌమ్యుడిగా గుర్తింపు పొందడం, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందడం వంటి అంశాలన్నీ బొమ్మైకు కలిసొచ్చాయని భావిస్తున్నారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో బసవరాజ బొమ్మై మరో రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఆయన తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మై జనతాపార్టీ తరఫున కర్ణాటక రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కుమారుడు, ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన బసవరాజ బొమ్మై బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. 


యడ్డి అభిమాని ఆత్మహత్య

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేముందు యడియూరప్ప కన్నీటి పర్యంతం కావడాన్ని టీవీల్లో వీక్షించిన ఆయన వీరాభిమాని రవి(35) యడియూరప్పకు ఆయన అభిమాని ఒకరు తీవ్ర మనస్తాపానికి లోనై సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


యడియూరప్ప కన్నీటిలో బీజేపీ కొట్టుకుపోతుంది 

దింగాలేశ్వర స్వామిజీ

కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్ప నూత న ఒరవడి సృష్టించారని, ఆయన కన్నీటిలో రాష్ట్రంలో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని గదగ జిల్లాలోని బాలె హొసూరు లింగాయత్‌ మఠాధితి దింగాలేశ్వర స్వామిజీ అన్నారు. యడియూరప్పతో ఆయన మంగళవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసే సమయంలో ఆయన పెట్టిన కంటతడి లక్షలాది మంది అభిమానుల హృదయాలను కదలించిందన్నారు. యడియూరప్ప వల్లే కర్ణాటకలో బీజేపీ నిలదొక్కుకుందని, పార్టీ అధిష్ఠానం ఒత్తిడితోనే రాజీనామా చేశారన్నారు.