త‌ల్లీ.. బైలెల్లినాదో..

ABN , First Publish Date - 2021-08-02T06:46:34+05:30 IST

పాతబస్తీలో శ్రీ మహంకాళి

త‌ల్లీ.. బైలెల్లినాదో..

నగరంలో ఆధ్యాత్మిక శోభ

భక్తిశ్రద్ధలతో ఘనంగా బోనాలు

ఆలయాల్లో పండుగ శోభ

బోనాలతో తరలివచ్చిన మహిళలు

భాగ్యనగరం బోనమెత్తింది. అమ్మనామస్మరణలో నగరం పులకించింది. లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం బోనాలతో తరలివచ్చిన మహిళలతో కళకళలాడింది.  పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తిభావాన్ని పెంపొందించాయి. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి సాక పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. డీజే దరువులకు యువత తీన్మార్‌ నృత్యాలు సందడిని పెంచాయి. 


చాంద్రాయణగుట్ట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీలో శ్రీ మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ, ఉప్పుగూడ, గౌలిపురా, మీరాలమండి మహంకాళి ఆలయలుఉ, చందూలాల్‌ బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ, చార్మినార్‌ భాగ్యలక్ష్మి, మేకలబండ నల్లపోచమ్మతో పాటు బస్తీల్లోని పలు ఆలయాల వద్ద ఆఽధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పాతబస్తీలోని దేవాలయాలకు వీఐపీలు అధిక సంఖ్యలో వచ్చారు. లాల్‌దర్వాజ అమ్మవారికి  మాజీ హోం మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ కుటుంబసభ్యులు మొదటి బోనం సమర్పించారు మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పలు ఆలయాల్లో పట్టు వస్ర్తాలు సమర్పించారు. 


నేడు ఘటాల ఊరేగింపు

నేడు ఘటాల ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలను చేసి మధ్యాహ్నం పోతరాజులకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం భవిష్యవాణి (రంగం) వినిపించిన అనంతరం ఊరేగింపు ప్రారంభం అవుతుంది. 


ప్రముఖుల తాకిడి.. ఎవరేమన్నారంటే..

చాంద్రాయణగుట్ట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : 

దేవాలయాల అభివృద్ధికి, పండుగలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బోనాల ఉత్సవాలకు రాష్ట్రం ఏర్పడ్డాకే తగిన గుర్తింపు లభించిందన్నారు. లాల్‌దర్వాజ బోనాలు ప్రత్యేకమైనవని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌ అంటే సర్వమతాల సమ్మేళనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సీనియర్‌ నాయకురాలు, సినీనటి విజయశాంతి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి, సినీ గాయకురాలు మధుప్రియ, దైవజ్ఞ శర్మ, టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్‌, వైసీపీ గ్రేటర్‌ సీనియర్‌ నాయకుడు తిరుపతి శ్రీనివాస్‌రావు తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

పటిష్ట బందోబస్తు 

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్‌ సీపీ శిఖా గోయెల్‌, దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌, అనిల్‌కుమార్‌, దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌ పర్యవేక్షించారు. 

కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో... 

కవాడిగూడ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో మాస్కులు  ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అంబర్‌పేట మహంకాళి ఆలయంలో... 

రాంనగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : అంబర్‌పేట శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం 5 నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అమ్మవారికి మొక్కులు  సమర్పించుకున్నారు. 


Updated Date - 2021-08-02T06:46:34+05:30 IST